IND vs BAN | రెండో టెస్టులో మరో చరిత్రకు అశ్విన్​కు అవకాశం – ఆరు రికార్డులు సిద్ధం

భారత్​ – బంగ్లాదేశ్​ల మధ్య జరుగుతున్న 2 మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​లో మొదటి మ్యాచ్​ను రవిచంద్రన్​ అశ్విన్​ అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ చెలరేగి భారత్​ చేతిలో పెట్టాడు. ఇప్పుడు 27న ప్రారంభం కాబోయే రెండో టెస్టులో పలు రికార్డులు అశ్విన్​కు అందేంత దూరంలోనే ఉన్నాయి.

  • By: Tech    sports    Sep 25, 2024 10:03 PM IST
IND vs BAN |  రెండో టెస్టులో మరో చరిత్రకు అశ్విన్​కు అవకాశం – ఆరు రికార్డులు సిద్ధం

రవిచంద్రన్​ అశ్విన్​(Ravichandran Ashwin), భారత స్టార్​ స్పిన్నర్​. భారత్​, బంగ్లాల మధ్య జరిగిన మొదటి టెస్టులో బ్యాటుతో సెంచరీ, బాల్​తో రెండో ఇన్నింగ్స్​లో 6 వికెట్లు తీసుకుని 280 పరుగుల భారీ ఆధిక్యంతో భారత్​ ఘనవిజయం సాధించేందుకు తోడ్పడ్డాడు. ఇక రెండో టెస్టు ఈనెల 27న కాన్పూర్​(Kanpur Test)లో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో బద్దలు కొట్టేందుకు అశ్విన్​కు ఆరు రికార్డులు(Six Records) సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  1. టెస్ట్మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్.

ఇప్పటికే నాలుగో ఇన్నింగ్స్​లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్​గా పేరు తెచ్చుకున్న అశ్విన్​, ఇంకా ఒక వికెట్​ తీసుకుంటే 100 వికెట్లు తీసుకున్న మొదటి భారతీయుడిగా, ప్రపంచవ్యాప్తంగా ఆరో బౌలర్​గా చరిత్ర సృష్టించనున్నాడు.

  1. ఇండియాబంగ్లా టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్

అశ్విన్​ మరో మూడు వికెట్లు తీసుకుంటే బంగ్లాదేశ్​పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డులకెక్కుతాడు. ఇంతకుముందు ఈ రికార్డు జహీర్​ఖాన్​(31 వికెట్లు) పేరిట ఉంది.

  1. 2023–25 టెస్ట్ చాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్

మరో నాలుగు వికెట్లు తీయగలిగితే 52 వికెట్లతో  ఈ 2023–25 టెస్ట్​ చాంపియన్​షిప్​లో జోష్​ హాజిల్​వుడ్​ రికార్డును తెర మరుగుచేసే అవకాశం ఉంది.

  1. టెస్టుల్లో అత్యధికసార్లు అయిదు వికెట్ల తీసినవారిలో రెండో స్థానం

టెస్టుల్లో అయిదు వికెట్ల ప్రదర్శన చేసిన వారిలో గ్రేట్​ షేన్​ వార్న్​తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మరోసారి 5 వికెట్లను తీస్తే, రెండోస్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు.

  1. టెస్ట్ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్

187 వికెట్లతో టెస్ట్​ చాంపియన్​షిప్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్​గా ఉన్న నాథన్​ లియాన్​ రికార్డు చెరిపేయడానికి అశ్విన్​కు మరో 8 వికెట్లు అవసరం. ప్రస్తుతం అశ్విన్​ వికెట్లు 180.

  1. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్

ఇంకో తొమ్మిది వికెట్లు తీసుకుంటే టెస్ట్​ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఏడో బౌలర్​గా నాథన్​ లియాన్​ను దాటిపోతాడు.

ఇవీ అశ్విన్​ ముందున్న ఆరు రికార్డులు. ప్రస్తుతం తను ఉన్న ఫామ్​ చూస్తే ఈ రికార్డుల్లో కొన్నైనా గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది.