Royal Challengers Bengaluru Storm Into Playoffs With Dominant Win Over Punjab Kings
- 6 వరుస పరాజయాలతో పతనావస్థలో పంజాబ్
- కోహ్లీ–పడిక్కల్ పునాది.. వెంకటేశ్ అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్
విధాత, స్పోర్ట్స్ డెస్క్ | మే 17, 2026:
ధర్మశాల: రాయల్ చాలెంజర్స్ అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఇక్కడ పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి 18 పాయింట్లతో ఐపీల్ 2026లో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన మొదటి జట్టుగా నమోదైంది. కాగా, వరుసగా 6 పరాజయాలతో పంజాబ్ జట్టు తన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసుకుంది.
పవర్ ప్లే లోనే పంజాబ్ ఆశలు గల్లంతు
బెంగళూరు విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఖాతా కూడా తెరవకుండానే ఔటవగా, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 1 పరుగుకే వెనక్కి మరలడంతో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. కేవలం 3.2 ఓవర్లలోనే 19 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో పవర్‌ప్లేలోనే పంజాబ్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశారు.
తర్వాత వచ్చిన బ్యాటర్లు కనోలీ(37), షెగ్డే(35), స్టయినిస్(37), శశాంక్(56) రాణించినా, సాధించాల్సిన లక్ష్యం పెద్దది కావడం కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం పంజాబ్‌ను విజయానికి దూరం చేసింది.
బెంగళూరు బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు, భువీ 2 వికెట్లు, హేజిల్‌వుడ్, సుయాశ్, షెపర్డ్ తలా ఒక వికెట్ సాధించారు.
వెంకటేశ్ అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్‌తో బెంగళూరు భారీ స్కోరు
కాగా, టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ధర్మశాల మైదానంలో విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆర్‌సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ప్రారంభంలో జాగ్రత్తగా ఆడిన ఆర్‌సీబీ బ్యాటర్లు.. చివరి ఓవర్లలో గేర్ మార్చి పరుగుల వరద పారించారు.
ఇన్నింగ్స్‌కు విరాట్ అద్భుత పునాది వేయగా.. చివర్లో వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా ఆర్‌సీబీ వైపు తిప్పేసింది. వెంకటేశ్ అయ్యర్ కేవలం 40 బంతుల్లోనే 73 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టిమ్ డేవిడ్ కూడా ఎడాపెడా బాది 12 బంతుల్లో 28 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
కోహ్లీ–పడిక్కల్ భాగస్వామ్యం కీలకం
పంజాబ్‌పై కీలక మ్యాచ్‌లో అర్థసెంచరీల జోష్‌తో విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలో పిచ్ కొంత నెమ్మదిగా అనిపించినా.. కోహ్లీ, పడిక్కల్ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా ముందుకు సాగిన ఈ జోడీ.. తర్వాత స్ట్రైక్ రొటేషన్‌తో పాటు చెత్త బంతులను బౌండరీలకు తరలించింది. మధ్య ఓవర్లలో ఈ భాగస్వామ్యమే ఆర్‌సీబీకి బలమైన పునాది వేసింది.
మ్యాచ్ అనంతరం పడిక్కల్ మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై 220కి పైగా స్కోరు చాలా మంచి టోటల్. కొత్త బంతి కొంచెం నెమ్మదిగా వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో భాగస్వామ్యాలు చాలా ముఖ్యం” అని చెప్పాడు.
చివరి ఓవర్లలో వెంకీ విధ్వంసం
17వ ఓవర్ తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మొదట నెమ్మదిగా ఆడిన వెంకటేశ్ అయ్యర్.. చివరి మూడు ఓవర్లలో పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చివరి ఓవర్‌లో అర్షదీప్‌సింగ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ కొట్టిన భారీ సిక్స్, వరుస బౌండరీలతో ఆర్‌సీబీ స్కోరు 220 దాటింది.
పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ ఒక్క వికెట్ తీసుకున్నా.. అతడు 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు.
పంజాబ్‌పై ఒత్తిడి
ఇది పంజాబ్‌కు వరుసగా ఆరో పరాజయం. ఇప్పటికే ఈ సీజన్‌లో పంజాబ్ బౌలింగ్, ఫీల్డింగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్‌తో ఒకే సీజన్‌లో ప్రత్యర్థి జట్లకు 9 సార్లు 200కు పైగా స్కోర్లు ఇచ్చిన తొలి జట్టుగా కూడా పంజాబ్ చెత్త రికార్డు నమోదు చేయడంతో పాటు, 6 ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకుంది.
