గిల్‌ గర్జనలో కొట్టుకుపోయిన రాజస్థాన్‌.. ఫైనల్లో గుజరాత్‌ : బెంగళూరుతో ఢీ

ఐపీఎల్‌ 2026 క్వాలిఫయర్‌-2లో శుభ్‌మన్‌ గిల్‌ శతకంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరింది. వైభవ్‌ సూర్యవంశీ 96 పరుగుల పోరాటం వృథా కాగా, రాజస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

శుభ్‌మన్‌ గిల్‌ శతకంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు చేరిన దృశ్యం

గిల్‌ సెంచరీతో రాజస్థాన్‌ను ఓడించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది

 

సూర్యవంశీ 96 వృథా.. 215 లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టైటాన్స్‌

చంఢీగఢ్​: ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2026 క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 214 పరుగుల భారీ స్కోరు చేసినా.. శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత శతకంతో ఆ లక్ష్యాన్ని గుజరాత్‌ అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లగా, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రయాణం క్వాలిఫయర్‌-2తో ముగిసింది. 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.5 ఓవర్లతో ​ 3 వికెట్లు కోల్పోయి అవలీలగా చేరుకుంది.

దిరిపోయిన గుజరాత్​ అరంభం – శుభమన్​ గిల్​ ప్రశాంత శతకం

Caption:
గిల్‌ శతకం, సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీతో రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. భారీ లక్ష్యం ఉన్నా, ఈ జోడీ ఎక్కడా ఒత్తిడికి లోనుకాలేదు. పవర్‌ప్లే నుంచే రాజస్థాన్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ స్కోరుబోర్డును వేగంగా పరుగులు పెట్టించింది. గిల్‌ క్లాస్‌, టైమింగ్‌, షాట్‌ సెలక్షన్‌ ముందు రాజస్థాన్‌ బౌలింగ్‌ పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది.

గిల్‌ కేవలం 47 బంతుల్లోనే శతకం బాదాడు. ఇది అతని ఐపీఎల్‌ కెరీర్‌లో ఐదో సెంచరీ కావడం విశేషం. నాకౌట్‌ మ్యాచ్‌ ఒత్తిడి, ఫైనల్‌ బెర్త్‌ ప్రాధాన్యం, భారీ లక్ష్యం — ఈ మూడు సవాళ్ల మధ్య గిల్‌ ఆడిన తీరు గుజరాత్‌ విజయానికి వెన్నెముకగా నిలిచింది. హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన అతను రాజస్థాన్‌ ఆశలపై మెల్లమెల్లగా నీళ్లు చల్లాడు. ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడీ లేకుండా గిల్​ ఆడిన తీరు ప్రేక్షకులను ముగ్ధులను చేసింది.

సాయి సుదర్శన్‌ కూడా గుజరాత్‌ ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. అతను హాఫ్‌ సెంచరీతో గిల్‌కు బలమైన తోడ్పాటు అందించాడు. అయితే మరోసారి హిట్​ వికెట్​ రూపంలో ఔటవడం మ్యాచ్‌లో విచిత్రమైన అంశంగా నిలిచింది. వరుసగా రెండు మ్యాచుల్లో సుదర్శన్‌ hit-wicket కావడం అరుదైన దృశ్యంగా మారింది. అయినా అప్పటికే మ్యాచ్​ పూర్తిగా నియంత్రణలోకి వచ్చేసింది.

రాజస్థాన్‌ బౌలర్లు తొలి వికెట్‌ కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వచ్చింది. భారీ స్కోరు ఉన్నా, గిల్‌–సుదర్శన్‌ జోడీని విడదీయలేకపోవడం ఆర్​ఆర్​కు పీడకలగా మారింది. మిడిల్‌ ఓవర్లలో కూడా ఒత్తిడి సృష్టించలేకపోవడంతో మ్యాచ్‌ క్రమంగా గుజరాత్‌ వైపు మొగ్గింది. చివర్లో గిల్​ ఆర్చర్​ బౌలింగ్​లో వికెట్ల ముందు దొరికిపోయినా పెద్ద తేడా ఏం జరగలేదు. చివరికి గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో, 8 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.

పాపం సూర్యవంశీ.. సెంచరీ మిస్‌, విజయం కూడా మిస్‌

Caption:
క్వాలిఫయర్‌-2లో సెంచరీకి చేరువై 96 పరుగులతో మెరిసిన వైభవ్‌ సూర్యవంశీ

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆరంభం మాత్రం రాజస్థాన్‌కు షాక్‌లతోనే మొదలైంది. యశస్వి జైస్వాల్‌ 1 పరుగుకే వెనుదిరగగా, ధ్రువ్‌ జురెల్‌(7) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తక్కువ స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఒత్తిడిలో పడింది.

అయితే అక్కడి నుంచి వైభవ్‌ సూర్యవంశీ రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ను ఒంటిచేత్తో నడిపించాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేసిన ఈ యువ సంచలనం.. గుజరాత్‌ బౌలర్లను చీల్చి చెండాడాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అతని ఇన్నింగ్స్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. కానీ మరోసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోవడం రాజస్థాన్‌కు, అభిమానులకు నిరాశపర్చింది.

సూర్యవంశీకి రవీంద్ర జడేజా మంచి తోడ్పాటు అందించాడు. ఒక ఎండ్‌లో జడేజా నిలకడగా ఆడగా, మరో ఎండ్‌లో సూర్యవంశీ దూకుడుగా స్కోరు పెంచాడు. చివరి ఓవర్లలో డోనోవన్‌ ఫెరెరా మెరుపు బ్యాటింగ్‌ రాజస్థాన్‌ స్కోరును 200 దాటించింది. ఫెరెరా 11 బంతుల్లో 38 పరుగులతో గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

క్ష్యం పెద్దదే.. కానీ గుజరాత్​ సంకల్పం ఇంకా పెద్దది..

సాధారణంగా నాకౌట్‌ మ్యాచ్‌లో 214 పరుగుల స్కోరు గెలుపుకు సరిపోయేదే. కానీ గిల్‌ శతకం ఆ లెక్కలన్నీ మార్చేసింది. సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌, ఫెరెరా మెరుపులు, జడేజా నిలకడ — ఇవన్నీ కలిసినా రాజస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చలేకపోయాయి. చివరికి ఈ మ్యాచ్‌ సూర్యవంశీ ప్రతిభకు కాదు, గిల్‌ ప్రశాంత ఛేదనకు గుర్తుండిపోయేలా మారింది.

ఈ విజయంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఆదివారం మే 31న ఫైనల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం మరోసారి కీలక మ్యాచ్​లో  నిరాశపరిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూర్యవంశీ సెంచరీ మరోసారి మిస్‌ అయిన బాధకు తోడు, అతని ఇన్నింగ్స్‌ వృథా కావడం రాజస్థాన్​ శిబిరాన్ని మరింత కలచివేసింది.

Latest News