Vaibhav Suryavanshi Awarded | అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి బీహార్ సీఎం భారీ నజరానా

అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు కప్ అందించిన వైభవ్ సూర్యవంశీకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ రూ.50 లక్షల నగదు బహుమతి అందించారు. ఐపీఎల్‌లోనూ రికార్డులు సృష్టించిన ఈ 14 ఏళ్ల యువ క్రికెటర్​ను తమ రాష్ట్రానికి గర్వకారణంగా సీఏం ప్రశంసించారు.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 22, 2026 10:31 PM IST
Vaibhav Suryavanshi Awarded | అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి బీహార్ సీఎం భారీ నజరానా

 Vaibhav Suryavanshi Gets Rs 50 Lakh Reward from Bihar CM Nitish Kumar After U19 World Cup Heroics

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​: 

Vaibhav Suryavanshi Awarded | అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి కప్ అందించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం ఘన గౌరవం తెలిపింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన అధికార నివాసానికి ఆయనను ఆహ్వానించి రూ.50 లక్షల నగదు చెక్కును అందించారు. డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి, క్రీడామంత్రి శ్రేయసి సింగ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైభవ్ విజయాన్ని బీహార్ యువతకు ప్రేరణగా అభివర్ణించిన సీఎం, క్రీడల్లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైభవ్‌కు శాలువా కప్పి సన్మానించారు.

వరల్డ్ కప్‌లో చరిత్రాత్మక ఇన్నింగ్స్

అండర్-19 హీరో వైభవ్ సూర్యవంశీకి రూ.50 లక్షలు.. సీఎం నితీశ్ కుమార్ ఘన సన్మానం

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై వైభవ్ 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో దూకుడుగా ఆడిన ఆయన 55 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌ల్లో 439 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. 30 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో భారత్ ఆరవసారి అండర్-19 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌లోనూ రికార్డుల వర్షం

వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన ఆయన గుజరాత్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది వేగవంతమైన భారతీయ శతకంగా నిలిచాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టి తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. గత సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌లలో 252 పరుగులు చేసి తన దూకుడు ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. యూ19 వన్డేల్లో భారత్ తరఫున 1,400కిపైగా పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

తన దూకుడుశైలి కొన్నిసార్లు విఫలమయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, బ్యాట్‌కు బంతి సరిగ్గా తగిలితే స్టేడియం మొత్తం మార్మోగేలా సిక్సర్లు బాదడం ఆయన ప్రత్యేకత. 2026 ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న ఈ యువ తారపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. బీహార్ నుంచి వెలుగులోకి వచ్చిన ఈ చిన్నారి క్రికెటర్ భవిష్యత్‌లో భారత జట్టుకు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.