Vinesh Phogat | వినేశ్‌ ఫొగట్‌కు రజత పతకం ఇస్తారా?

వందగ్రాముల బరువు అధికంగా ఉన్నందుకు తనపై అనర్హతవేటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్) నుంచి సానుకూల తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది

Vinesh Phogat | వినేశ్‌ ఫొగట్‌కు రజత పతకం ఇస్తారా?

అవకాశాలు ఉన్నాయంటున్న ఐవోఏ అధికారులు

పారిస్‌ : వందగ్రాముల బరువు అధికంగా ఉన్నందుకు తనపై అనర్హతవేటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్) నుంచి సానుకూల తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ విషయంలో విచారణ కొనసాగుతున్నది. వినేశ్‌ వాదనను సీఏఎస్‌ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని గురువారం సాయంత్రం ప్రకటించనున్నారు. తనకు 50 కిలోల విభాగంలో రజత పతకం ఇవ్వాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.

ఒలింపిక్‌ తొలి బౌట్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌కు చెందిన యూయీ సుసాకిపై సంచలన విజయం నమోదు చేసుకున్న వినేశ్‌ ఫొగట్‌.. అనంతరం మూడు వరుస బౌట్లలో గెలిచి.. ఫైనల్స్‌కు చేరుకున్నది. అయితే.. నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్నందుకు ఆమెను ఫైనల్స్‌కు అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ముందు రోజురాత్రి రెండు కేజీల బరువు ఉండటంతో ఆమె మంగళవారం రాత్రంతా వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించింది. కానీ.. ఉదయానికి కేవలం 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమె బంగారు అవకాశాన్ని కోల్పోయింది.