WPL 2026 | ముంబైపై యూపీ సంచలన విజయం : హర్లీన్ ప్రతీకారం
WPL 2026లో యూపీ వారియర్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. హర్లీన్ దియోల్ అర్ధ సెంచరీ, ట్రయాన్ వేగవంతమైన 27*తో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై యూపీ 7 వికెట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది.
UP Warriorz stun Mumbai Indians with 7-wicket win; Harleen shines
సారాంశం:
హర్లీన్ దియోల్ అర్ధ సెంచరీ, క్లోయ్ ట్రయాన్ మెరుపుదాడితో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస పరాజయాలతో డీలా పడిన యూపీ ఈ విజయం వల్ల ఆత్మవిశ్వాసంతో పాయింట్ల ఖాతా తెరిచింది.
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
WPL 2026లో మూడు వరుస పరాజయాలతో వెనుకంజలో ఉన్న యూపీ వారియర్స్ చివరకు శుక్రవారం ఖాతా తెరిచింది. అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై సంచలన విజయం సాధించి మరీ. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి, యూపీ తిరిగి పోటీలో అడుగుపెట్టింది.
కేవలం 24 గంటల క్రితం ‘రిటైర్డ్ అవుట్’ వివాదంతో చర్చలోకి వచ్చిన హర్లీన్ దియోల్ ఇవాళ అద్భుత అర్ధ సెంచరీతో (64* – 39 బంతులు, 12×4) మ్యాచ్‌ను ఒంటిచేత్తో యూపీ వైపు తిప్పింది.
టాస్ గెలిచి, ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తన నిర్ణయం సరైనదే అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. యూపీ బౌలర్లు మొదటి ఓవర్ నుండే ముంబైను ఒత్తిడిలోకి నెట్టారు. పవర్‌ప్లేలో క్రాంతి గౌడ్, శిఖా పాండే బంతిని అద్భుతంగా స్వింగ్ చేసి ముంబై ఓపెనర్లను కట్టడి చేసారు. కమలినీ అడుగులు కదలకపోవడం, అమన్‌జోత్ వరుసగా ఎడ్జ్‌లు తీసుకోవడం—ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో అయోమయాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. పవర్‌ప్లేలో ముంబై కేవలం 32 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్‌లో తమ రెండో అతి తక్కువ పవర్‌ప్లే స్కోర్‌ను నమోదు చేసింది.
సివర్–బ్రంట్ పోరాటం : ముంబై ఓ మోస్తరు స్కోరు
దీని తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగారు. దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్ వరుస ఓవర్లలో అమన్‌జోత్ (38 బాల్స్‌లో 33), కమలినీ (12 బాల్స్‌లో 5)లను పెవిలియన్‌కు పంపి ముంబైను మరింత ఒత్తిడిలోకి నెట్టారు.
కానీ అక్కడ నుంచి నాట్ సివర్–బ్రంట్ అద్భుత ప్రతిఘటన చూపించింది. మొదట రెండు జీవన దానాలు లభించడంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న సివర్ (65 – 43 బంతులు) మ్యాచ్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. నికోలా క్యారీతో కలిసి నాలుగో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఎట్టకేలకు చివరి ఎనిమిది ఓవర్లలో 93 పరుగులు జోడించి, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్, తొలి రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. మెగ్ లానింగ్, కిరణ్ నవగిరే వెంటవెంటనే అవుట్ కావడంతో మళ్లీ పాత కథే పునరావృతమవుతుందేమో అనిపించింది. కానీ ఈసారి కథను మార్చింది హర్లీన్ దియోల్. గత మ్యాచ్‌లో ‘రిటైర్డ్ అవుట్’గా 47 పరుగుల వద్ద వెనక్కి పిలిపించి బాధపెట్టిన జట్టు మేనేజ్మెంట్, ఈసారి ఆమెపై పూర్తిగా నమ్మకం ఉంచింది.
హర్లీన్ డియోల్ : నిన్న ‘రిటైర్డ్ ఔట్’ – నేడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
మొదటినుండే ధాటిగా ఆడిన హర్లీన్, ఈసారి జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. హర్లీన్–ఫీబీ లిచ్‌ఫీల్డ్ ఇద్దరు కలసి మూడో వికెట్‌కు 73 పరుగులు జతచేశారు. లిచ్‌ఫీల్డ్ అవుట్ అయిన తర్వాత హర్లీన్ మరింత వేగాన్ని పెంచింది. వరుస బౌండరీలతో ముంబై బౌలర్లపై ఆధిపత్యం చూపించి మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించింది. చివర్లో క్లోయ్ ట్రయాన్ (27 – 11 బంతులు)* రెండు భారీ బౌండరీలు, ఒక సిక్స్‌తో విజయాన్ని మరింత ముందుకు తీసుకొచ్చింది. మిగిలిన 11 బంతుల్లో లక్ష్యాన్ని చేరుకున్న యూపీ వారియర్స్ ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. హర్లీన్ దియోల్ కు ‘Player of the Match’ అవార్డు దక్కింది.
మ్యాచ్ సారాంశం
ముంబై ఇండియన్స్ – 161/5
- సివర్–బ్రంట్: 65, అమన్‌జోత్: 38
- పాండే: 1-25
యూపీ వారియర్స్ – 162/3
- హర్లీన్ డియోల్: 64*, ట్రయాన్: 27*
- సివర్–బ్రంట్: 2-28
ఫలితం: యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో విజయం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram