Eiffel tower facts | మీకు తెలుసా..ఈఫిల్ ట‌వ‌ర్‌కు పెళ్లయింది..!

నిజ‌మేనండీ బాబూ.. ఈఫిల్ ట‌వ‌ర్‌(Eiffel Tower) కు వివాహం జ‌రిగింది. త‌న‌కో భార్య ఉంది. త‌న పేరు ఎరికా ఈఫిల్(Erika Eiffel). అమెరిక‌న్‌. 2007లో సంప్రదాయ‌బ‌ద్ధంగా ఈ పెళ్లి జ‌రిగింది.

  • Publish Date - June 3, 2024 / 08:01 AM IST

ఆశ్యర్యంగా ఉంది క‌దా. అవును..నిజ‌మే. ఎరికా లాబ్రీ Erika Labrie (46) అనే అమెరిక‌న్ వాయుసేన మాజీ సైనికురాలికి నిశ్చల వస్తువుల పట్ల శృంగార భావ‌న (Object Sexuality) లేదా ఆబ్జెక్టోఫిలియా(Objectophilia) అనే ఒక వింత రుగ్మత ఉంది. అంటే వీళ్లు చలనరహిత వ‌స్తువు(Inanimate objects)ల‌తో, కొన్ని స్మార‌క క‌ట్టడాల‌తో ప్రేమ‌లో ప‌డ‌తారు. మ‌నుషుల‌ను ప్రేమికులుగా ఇష్టప‌డ‌రు.  2004లో ఈఫిల్ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించిన‌ప్పుడు మొద‌టిచూపులోనే (?) దాంతో ఎరికా ప్రేమ‌లో ప‌డిపోయింది. అంత‌కుముందు బెర్లిన్ గోడ‌తో 20 ఏళ్లపాటు ప్రేమ‌లో ఉన్న ఎరికా, ఈఫిల్‌ను చూడ‌గానే ప్రేమించేసింది. అంతేకాదు, పెళ్లి కూడా చేసుకోవాల‌ని గ‌ట్టిగా నిర్ణయించుకుంది.

2007లో కొద్దిమంది స‌మ‌క్షంలో ఈఫిల్ ట‌వ‌ర్ రెండో అంత‌స్థులో సంప్రదాయ‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి మంత్రాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాష‌ల‌లో చ‌దివారు. ఆ సమ‌యంతో తానెంతో భావోద్వేగానికి గురైన‌ట్లు ఎరికా తెలిపింది. అంద‌రూ అపార్థం చేసుకుంటారు గానీ, మాకు వాటితో ఎంతో భావోద్వేగ‌ప‌ర‌మైన‌, దైవిక‌మైన అనుబంధం ఉంటుందే త‌ప్ప, ఇత‌ర‌త్రా కాదు. అయితే కొంత‌మందికి శృంగార‌ప‌ర‌మైన కోరిక‌లు ఉండ‌వ‌చ్చు అని ఎరికా అంటుంది. ఈఫిల్​ టవర్​ను చూడటానికి వచ్చేవారంతా ఎవరినో ప్రేమించినవారే. కానీ, ఈఫిల్​ టవర్​ను ఎవరూ ప్రేమించరనీ. తనకు వస్తువులో ప్రేమ కనబడుతుందని ఎరికా నమ్మకం. ఈఫిల్‌ను పెళ్లి చేసుకున్న ఎరికా, అమెరికాలో త‌న‌కు పెళ్లయిన‌ట్లు చ‌ట్టబ‌ద్ధంగా గుర్తింపు కావాల‌ని పెద్ద పోరాట‌మే చేసింది. దానికి చాలా స‌మ‌య‌మూ, డ‌బ్బూ వెచ్చించింది. ఎట్టకేల‌కు అమెరికా ప్రభుత్వం త‌న వివాహానికి చ‌ట్టబ‌ద్ధ గుర్తింపునిచ్చి, భ‌ర్త పేరు స్థానంలో ఈఫిల్ అని చేర్చింది. ఇప్పుడు త‌న అన్ని అధికారిక పత్రాల‌లో పేరు ఎరికా ఈఫిల్ అని ఉంటుంది పాస్‌పోర్ట్‌తో స‌హా.

ఎరికా గొప్ప విలుక‌త్తె. ధ‌నుర్విద్యలో అపార ప్రావీణ్యురాలు. 1999లో జ‌పాన్‌లో విలువిద్య(Recurve Archery)లో శిక్షణ పొంద‌టం ప్రారంభించిన ఎరికా, కాంపౌండ్ ధ‌నుస్సు(Compound Bow)తో బాణాలు వేయ‌డం 2000 వ సంవ‌త్సరం నుండి మొద‌లుపెట్టింది. 2003లో ఫిటా (FITA – International Archery Federation), ఒలింపిక్ రౌండ్‌ల‌లో, మూడు జాతీయ క‌ప్ పోటీల‌లో ప్రథ‌మ‌స్థానం సాధించింది. అమెరికా విలువిద్యారంగంలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్రద‌ర్శించింది. 2004, 2006ల‌లో విలువిద్య పోటీల‌లో అమెరికా జ‌ట్టు త‌ర‌పున ఒలంపిక్స్‌లో కూడా పాల్గొంది. విలువిద్యాప్రపంచంలో ఆమెను అయా(Aya) అని పిలుస్తారు.

1993లో యుఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో చేరిన ఎరికా మొద‌టి సంవ‌త్సరంలోనే లైంగిక‌దాడికి గురైంది. అప్పుడు త‌న ద‌గ్గరున్న శిక్షణ క‌ర‌వాలంతో ఆ దాడిని స‌మ‌ర్థవంతంగా తిప్పికొట్టింది. దాంతో అదే క‌త్తిని ఆమె ప్రేమించ‌డం మొద‌లుపెట్టింది. అందువ‌ల్ల త‌న‌కు వ్యక్తిగ‌త రుగ్మత‌లున్నాయ‌ని ఉద్యోగంలోనుండి తీసేసారు. నాకు నిద్రప‌ట్టాలంటే ఏదో దాని మీ చేయివేసి ప‌డుకోవాలి. న‌న్ను ర‌క్షించిన నా కత్తికంటే గొప్ప తోడెవ‌రుంటారు? అని ప్రశ్నించింది.  అదే ఆ రుగ్మత‌ను ఇంకా పెంచింది. అయితే దాన్ని ఆమె వ్యాధిగా ప‌రిగ‌ణించ‌డంలేదు. త‌న ధ‌నుస్సయిన లాన్స్‌తో ప్రేమ‌లో ప‌డ్డాను కాబ‌ట్టే, విలువిద్యలో చాంపియ‌న్‌గా నిలువ‌గ‌లిగాన‌ని గ‌ర్వంగా చెబుతుంది. త‌న‌లాంటి వాళ్ల కోసం ఎరికా ఈఫిల్ ఓఎస్ ఇంట‌ర్నేష‌న‌ల్ (OS International) అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ఆబ్జెక్టోఫిలియాతో బాధ‌ప‌డేవారికి అండ‌గా నిలిచి, అన్నిర‌కాలుగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

 

అన్నట్లు, ఎరికాకు ఈఫిల్​ టవర్​ బోర్​ కొట్టిందట. ఇప్పుడు తను ఇంకో కట్టడాన్ని ప్రేమిస్తోందని తెలుస్తోంది. దాన్ని ఆమె రహస్యంగా ఉంచుతోంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈసారి కాబోయే ప్రేమికుడు ఒక ఫెన్సింగ్​ (తీగలతో కట్టే గోడ) అని తెలిసింది.

పాపం.. తన భార్య ఇంకొకరితో ప్రేమలో పడిన విషయం తెలిస్తే ఈఫిల్​ టవర్​ ఎలా తట్టుకుంటుందో ఏంటో..!

 

Latest News