Potato Mother | ఆలుగడ్డ తల్లిదండ్రులెవరో తెలుసా?
ప్రతి జీవికి తల్లి తండ్రి ఉంటారు. అలాగే పండ్లు, ఫలాలు, కూరగాయలకు కూడా తల్లిదండ్రులు ఉంటారట. మరైతే బంగాళ దుంప తల్లిదండ్రులెవరో తెలుసా? సుదీర్ఘంగా సాగిన పరిశోధనలో శాస్త్రవేత్తలు బంగాళ దుంప తల్లెవరో, తండ్రెవరో తేల్చేశారు!

Potato Mother | మన పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మానవుడికి ఉంటుంది. అంతెందుకు మన ముందు తరాల వారు ఎవరో మన పెద్ద వాళ్లను అడిగి తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతాం. అది సహజం. అయితే కొందరు శాస్త్రవేత్తలకు బంగాళ దుంప పుట్టుపూర్వోత్తరాల గురించి ఆరా తీశారు. ఆలూ అని మనం పిలుచుకునే బంగాళదుంప ప్రయాణం 90 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. దాని మూలాలు వెతికే క్రమంలో పొటాటో తరహా కాని ఒక వెజిటబుల్ నుంచి బంగాళ దుంప ఉద్భవించిందని తెలుసుకున్నారు. 80.. 90 లక్షల సంవత్సరాల క్రితం టమాటాలు, బంగాళదుంపను పోలిన ఒక జాతి దుంప ఉండేవి. ఈ సామాన్యమైన కూరగాయల వంశం చాలా గందరగోళంగా ఉన్నది. ఇది పెటోటా అనే జాతుల శ్రేణికి చెందినది. టమాటా పూర్వ జాతి అడవి బంగాళా దుంప జాతికి చెందిన ట్యూబెరోసమ్‌తో సంపర్కం కారణంగా ఇది జన్మించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ట్యూబెరోసమ్ మధ్య చిలీ ప్రాంతాల్లో తొలుత గుర్తించారు. ఈ క్రాస్‌బ్రీడింగ్ ఫలితమే ప్రస్తుత ట్యూబర్స్, బంగాళ దుంపలని చెబుతున్నారు.
హైబ్రిడ్‌తో కొత్త జన్యువు
ఆండెస్ ప్రాంతంలో అడవి టమాటాలు పెరిగినప్పుడు అడవి బంగాళ దుంపల మధ్య కలయిక ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది కొత్త జన్యువు పుట్టుకకు కారణమైందని అంటున్నారు. ఆ జన్యు క్రమంలో పొటాటో జాతి మొదలైందని చెబుతున్నారు. అయితే.. ఆధునిక టమాటా, ట్యూబెరోసం మొక్కలలో ట్యూబర్స్ పూర్వజాతుల ఆనవాళ్లు లభించకపోవడం గమనార్హం. ఈ రెండూ కలిసి ఒక హైబ్రిడ్‌ను ఉత్పత్తి చేసినందునే వాటి వంశ క్రమంలో ఇవి కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు వేర్వేరు జాతులు కలిసినప్పుడు పూర్తిగా కొత్తది కొత్త జాతి ఉద్భవించడం అద్భతమైన విషయమని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం వివరాలు జర్నల్ సెల్ లో జూలై 31న పబ్లిష్ అయ్యాయి.
తల్లిదండ్రులను తేల్చేశాం
‘పొటాటోలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంలో మిస్టరీని ఎట్టకేలకు మేం ఛేదించాం’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సాన్‌వెన్ హుయాంగ్ చెప్పారు. ఈయన షెన్‌జెన్‌లోని అగ్రికల్చరల్ జీనోమిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్. ‘రెండు జాతుల కలయికతో కొత్త వంశం, దాని నుంచి మరికొన్ని వంశాలు ఎలా ఉద్భవిస్తాయో మా అధ్యయనంలో వెల్లడైంది’ అని ఆయన చెప్పారు. అయితే.. బంగాళ దుంప తండ్రి ఇప్పుడు ఉన్న బంగాళదుంపకు పూర్తి భిన్నమైన జాతిగా పేర్కొన్నారు. నిజానికి అది కూరగాయ కాదని, అదొక పండు అని తెలిపారు.