Artificial Intelligence | వామ్మో.. కృత్రిమ మేధతో ఇన్ని డేంజర్లా? నశించనున్న మానవ మేధ!

ఒక సాంకేతికత జనాదరణ పొందేందుకు, భిన్న మార్గాల్లో అభివృద్ధి చెందేందుకు కనీసం దశాబ్దాకలమైనా పడుతుంది. కానీ.. కృత్రిమ మేధ విషయంలో మాత్రం రెండు మూడేళ్లలోనే పీక్‌ స్టేజ్‌కు వెళ్లిపోయిందా? అనిపిస్తుంది. ఇదే పీక్‌ స్టేజ్‌ కాదు.. రాబోయే రోజుల్లో సంవత్సరాల్లో ఏఐ విషయంలో ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించడానికి కూడా సాహసించడం లేదు. సాహసించినా నియంత్రించే మార్గాలు కూడా కనిపించడం లేదు.

Artificial Intelligence | వామ్మో.. కృత్రిమ మేధతో ఇన్ని డేంజర్లా? నశించనున్న మానవ మేధ!

Artificial Intelligence | మీరు చూస్తున్న వ్యక్తి ఆయన కాదు! మీరు వింటున్న మాటలు ఆయన చెప్పినవి కావు! మీరు చూస్తున్న రూపం సదరు వ్యక్తిది కాదు! అంతా మాయ! కొన్ని రోజుల క్రితం అమెరికాలో టెస్లా కార్ల తయారీని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించినదిగా చెబుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చొరబడింది. కొన్ని వెబ్‌సైట్స్‌ ఇది నిజమేననుకుని వార్తలను కూడా వండాయి. కానీ.. చివరికి అది డీప్‌ఫేక్‌ అని తేలింది. ఇది డీప్‌ఫేక్‌ అని తేలడానికి ఎక్కువ సమయం పట్టి ఉంటే? ఈలోపు టెస్లా షేర్‌ హోల్డర్ల ఆలోచనలు ఎలా ఉండేవి? ఒక్కసారిగా వాటి ధరలు కుప్పకూలేవి. ఏది నిజమో లేది అబద్ధమో నమ్మలేని స్థితికి మనిషి వెళ్లిపోతాడు! ఆ దుష్ర్పచారం అమాయకుల ఫోన్లలోకి చొరబడిదంటే జరిగేది విధ్వంసమే! ఇదొక నిదర్శనం.. ఏఐ ఎంత ప్రమాదకారి అనేది అర్ధం చేసుకోవడానికి!

ఇటీవల న్యూజీలాండ్‌ పార్లమెంటు నిండు సభలో మహిళా ఎంపీ లారా మెక్‌లూర్‌.. ఏఐతో తాను సృష్టించిన తన నగ్న ఫొటోను ప్రదర్శించారు. అది తయారు చేయడానికి ఆమెకు ఐదంటే ఐదు నిమిషాలే పట్టింది. డీప్‌ఫేక్‌ ప్రమాదాలు ఏ స్థాయిలో ఉంటాయో, అసాంఘిక శక్తులు లైంగిక కంటెంట్‌ను ఎంత సులభంగా రూపొందించగలరో చెప్పేందుకు ఉదాహరణగా ఆమె ప్రస్తావన చేశారు. మధ్య తరగతి, పేద కుటుంబానికి సంబంధించిన అటువంటి ఫొటో ఒకటి వస్తే? ఆ కుటుంబం, ఆ బాంధవ్యం కుప్పకూలిపోతాయనేందుకు ఇది మరో నిదర్శనం!

కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చిందని, 21వేలు ఇన్వెస్ట్‌ చేస్తే భారీ స్థాయిలో రిటర్న్స్‌ ఉంటాయని చెబుతున్నట్టు కనిపించే, వినిపించే ఒక ఫేక్‌ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నది. అది నిజమని నమ్మి ఎవరైనా ప్రయత్నిస్తే? జరిగే ఆర్థిక నష్టం నుంచి ఆ కుటుంబం కోలుకోగలదా? డీప్‌ఫేక్‌ వీడియోలతో ఎంతటి వినాశకర పరిస్థితులు ఉన్నాయో ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన పలువురు సినీ హీరోయిన్ల వీడియోలే నిదర్శనం.

ఇలాంటివే కాదు.. అనేక రంగాలను ప్రభావితం చేసే 15కుపైగా ప్రమాదాలు ఏఐతో ఉన్నాయని, అవి వ్యవస్థలను విచ్చిన్నం చేయగల శక్తి కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఎంత శక్తిమంతమైనదో అంతటి వినాశకారి కూడా అని అంటున్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను ఏఐ దెబ్బతీస్తున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారాన్ని విస్తృతం చేస్తున్న పరిస్థితినీ ఎదుర్కొంటున్నాం. ఇది మానవాళికి పెను ముప్పుగా తయారవకముందే దాన్ని నియత్రించే, నైతిక నియమావళికి అనుగుణంగా నడుచుకునే మార్గదర్శకాలను కఠినమైన పద్ధతిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు? అనేది అత్యంత కీలకమని అంటున్నారు. దీన్ని గమనిస్తే దాని ప్రభావాలను నియంత్రించవచ్చిన చెబుతున్నారు.

ఈ విషయాలు మనకంటే తెలివిమీరి ఉండొచ్చ. మనల్ని తన బందీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందల్లా.. అటువంటి పరిణామాలు తలెత్తకుండా ఏం చేయాలనేదే’ అని జెఫ్రీ హింటన్‌ చెప్పారు. ఈయన సాదా వ్యక్తి లేదా నిపుణుడు కాదు. మషీన్‌ లెర్నింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్‌ అల్గోరిధంలపై వర్క్‌ చేసి.. వాటి ఆధారంగా వచ్చిన ఏఐకి గాడ్‌ఫాదర్‌గా ప్రపంచం పిలుచుకునే వ్యక్తి. ఏఐతో కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించడానికి, అప్రమత్తం చేయడానికి 2023లో ఆయన గూగుల్‌లో తన పదవికి రాజీనామా చేశారు. తాను చేసిన పనికి జీవితాంతం చింతిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఆందోళనను వ్యక్తి చేస్తున్నవారిలో ఈయన ఏకాకి కాదు. భారీ స్థాయిలో ఏఐ ప్రయోగాలకు కొంత విరామం ఇవ్వాలని 2023లో ఒక బహిరంగ లేఖపై సంతకాలు చేసిన వెయ్యిమందిలో స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఒకరు. ఈ సాంకేతిక సమాజానికి, మానవతకు పెను ప్రమాదాలు సృష్టిస్తుందని ఆ లేఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐతో ప్రధానంగా ఆటోమేషన్‌ ఆధారిత ఉద్యోగాల్లో ఉన్నవారు తమ కొలువులు కోల్పోతారు. డీప్‌ఫేక్‌ వంటి వినాశాలు పెరుగుతాయి. ఆంగరంగిక గోప్యతకు పెను సవాళ్లు ఎదురవుతాయి. అల్గోరిధంతో పక్షపాత, దుష్ట సమాచారం వ్యాప్తి చెందుతుంది. సామాజిక అసమానతలకు కారణమవుతుంది. స్టాక్‌మార్కెట్‌లను అతలాకుతలం చేస్తాయి. ఆటోమేటిజేషన్‌ను మరింత శక్తిమంతంగా మార్చుతుంది. తనను తాను నియంత్రించుకోలేని స్వీయ అవగాహన ఏఐకి ఎదురవుతుంది. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు. వీటిలో ఇప్పటికే కొన్ని మన అనుభవంలో ఉన్నా.. ఇప్పుడు మనం ఉన్నది చాలా స్వల్పమైన ప్రాధమిక దశలోనేనని నిపుణులు చెబుతున్నారు.

పారదర్శకత ఉండదు.. వివరించేవాళ్లూ ఉండరు

ఏఐ, డీప్‌ లెర్నింగ్‌ మషీన్‌ మోడళ్లను అర్థం చేసుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. సంబంధిత సాంకేతికపై నేరుగా పనిచేస్తున్నవారికి సైతం ఇది అంతుచిక్కదని అంటున్నారు. ఫలితంగా ఒక అంశంపై ఏఐ ఒక నిర్ధారణకు ఎలా వచ్చింది? అనేది తేల్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. పారదర్శక ఏఐ వ్యవస్థలు సాధారణంగా పనిచేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. మరోవైపు ప్రముఖ ఏఐ అభివృద్ధి కంపెనీలు తమ ఉత్పత్తుల విషయంలో తీవ్ర గోప్యం ప్రదర్శిస్తున్నారు. అన్నింటికంటే సత్వర ప్రమాదం ఏఐ ఆధారిత జాబ్‌ ఆటోమేషన్‌తో కనిపిస్తున్నది. అనేక పరిశ్రమలు, మార్కెటింగ్‌, హెల్త్‌కేర్‌, మాన్యుఫాక్చరింగ్‌ వంటి రంగాల్లో ఇప్పటికే దీనిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పనుల్లో 30 శాతం గంటల పనిని 2030 నాటికి ఏఐ ఆధారితం చేయవచ్చని మెకిన్సే అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఏఐ ఆటోమేషన్‌ కారణంగా 30 కోట్ల మంది తమ పూర్తిసమయ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా. అంటే.. ఏఐతో భారీ స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతుంది. అయితే.. ఆ ఏఐని ఆపరేట్‌ చేసేవారికి మాత్రం గొప్ప అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలను ఏఐ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. వాటికి అనుగుణంగా తమ వర్క్‌ఫోర్స్‌కు ఆ యా సంస్థలు నైపుణ్యాలను పెంచకపోతే.. వారు వెనుకబడిపోతారని అంటున్నారు.

ఏఐ అల్గోరిధంల ద్వారా సామాజిక మోసాలు

కృత్రిమ మేధతో పెను ప్రమాదం సామాజిక అంశాలపైనే ఉంటుంది. ఒక నాయకుడు ఏం చెప్పకపోయినా.. అతని హావభావాలకు అనుగుణంగా, అతని గొంతును అనుకరించేలా చేసి ఫేక్‌ వీడియోలు తయారవుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. ట్రంప్‌ నుంచి మోదీ వరకూ.. అనేక మంది దీనికి బాధితులుగా ఉన్నారు. రాజకీయ నాయకులు వేదికను ఎక్కి చేసే ఉపన్యాసాన్ని వినటం ఒక్కటే అందుకు విరుగుడు. కానీ.. ఈ ఆధునిక ప్రపంచంలో దాని మీద ఎంతమంది ఎన్నిసార్లు ఆధాపడగలరు? అనేది ప్రశ్న. అసలే విద్వేషాల ప్రచారం మన దేశంలో యథేచ్ఛగా సాగిపోతున్న తరుణంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా వచ్చే కంటెంట్‌తో మరో వర్గం ఏ స్థాయిలో ప్రభావితమవుతుంది? ఎన్ని అనర్ధాలు చోటు చేసుకుంటాయి.. అనేది ఊహిస్తేనే ఒళ్లు జలదరించకమానదు. ఆన్‌లైన్‌ సోషల్‌ మీడియా అనేది ఇప్పటికే ఏఐ ఆధారిత ఫొటోలు, వీడియోలతో, ఏఐ వాయిస్‌ చేంజర్‌లతో దారుణంగా తయారైంది. డీప్‌ఫేక్‌ వీడియోల ఉన్మాదం చూడనిది కాదు. ఇవన్నీ చేతివేళ్లపై ఒక మొబైల్‌ ఫోన్‌తో అత్యంత సులభంగా తయారు చేసే అవకాశం ఉన్నవి. ఇవన్నీ రాజకీయ, సామాజిక రంగాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. వ్యవస్థలను కలుషితం చేస్తున్నాయి.

వివక్ష

ఏఐతో లింగ, వర్ణ వివక్షలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏఐని అభివృద్ధి చేసేది మనుషులేనని, వారి వర్ణం, మతం, నమ్మకాలు, వ్యతిరేకతలు, వారు వచ్చిన ప్రాంతాలు, అన్నీ ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఏఐని అభివృద్ధి చేసేవారు ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ప్రపంచంలో ఏడువేలకు పైగా స్వాభావిక భాషలు ఉంటే.. ఏఐ చాట్‌బాట్‌లకు శిక్షణ ఇచ్చే క్రమంలో సుమారు 100 భాషలు మాత్రమే ఉపయోగిస్తున్న విషయాన్ని యునెస్కో పేర్కొన్నది. ఏఐ వాడకంతో ఎదురయ్యే దుష్ప్రభావాలపై సాంకేతిక నిపుణులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులే కాదు.. మత పెద్దలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2024 ప్రపంచ శాంతి దినోత్సవం కోసం సందేశం ఇచ్చిన నాటి వాటికన్‌ పోప్‌ ఫ్రాన్సిస్‌.. ఏఐ అభివృద్ధి, వాడకం విషయంలో ఒక అంతర్జాతీయ ఒప్పందానికి రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇవి సృష్టించే తప్పుడు సమాచారాలు ఘర్షణలకు ఆజ్యం పోసి, శాంతిని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా నేరం చేయడం అంటే ఒక వ్యక్తిపై భౌతికంగా దాడి చేయడమో, ఇంట్లోపడి దోచుకోవడమో. ఇప్పుడు అది ఆన్‌లైన్‌ నేరాలకు విస్తరించి, తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. క్లోనింగ్‌ ప్రక్రియతో ఇతరుల గొంతును అనుసరించి చేస్తున్న బ్యాంకింగ్‌ మోసాలకు సంబంధించిన వార్తలు నిత్యం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. దీనికి కృత్రిమ మేధ తోడైతే జరిగే విపరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది అర్థమవుతూనే ఉన్నది. ఇప్పటికే పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌లకు, డీప్‌ఫేక్‌ వీడియోలకు బలవుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల, ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లల ప్రైవసీని కాపాడే విషయంలో పెను సవాళ్లు విసిరే ప్రమాదం కనిపిస్తున్నది. దీనిని అడ్డుకునేలా తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలను కూడా ఇటువంటి మోసాల బారిన పడకుండా చైతన్యవంతం చేయాలని చెబుతున్నారు.

నశించనున్న మానవ మేధ

ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవన్నీ కొన్ని లక్షల ఏళ్లుగా మానవుడి ఆలోచనల నుంచి ఆ ఆలోచన వారసత్వం నుంచి వచ్చినవి. మనిషి ఆలోచన ఎంతగా ఉంటే.. మానవ సమాజ ప్రగతి అంత ముందుకు వెళుతుంది. కానీ.. కృత్రిమ మేధతో కొన్ని రంగాల ప్రజల్లో ఆలోచనా సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఇది రాబోయే తరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఒక పెయిటింగ్‌ వేయాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. కానీ.. అదే చాట్‌బాట్‌లను తనకు కావాల్సిన అంశాలను ప్రస్తావించి ప్రాంప్ట్‌ ఇస్తే అదే చేసి పెడుతున్నది. ఇక మనిషి నైపుణ్యాలేం కావాలి? ఒక సమస్య పరిష్కరించాలంటే మనిషి తన మేధను ఉపయోగించాలి. కానీ.. ఏఐ సహకారం తీసుకుంటే మనిషి మేధ పనిచేసేది ఎక్కడ? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏఐ.. మనిషి నియంత్రించలేని స్థాయికి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశోధకులు చెబుతున్నారు. అది ప్రగతిశీల మార్గం అయితే సరే.. కానీ వినాశ స్థితికి నెట్టేస్తే? ఏఐ అత్యంత ప్రయెజనకారి అనేది నిర్వివాదాంశం. నిస్సందేహం. ఆరోగ్య రంగంలో డాటాను నిర్వహించడం మొదలు.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల తయారీ వరకూ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజువారీ పనులు సులభం చేస్తుంది. పరిశోధకులకు తగిన వివరాలు అందించడంలో సహకరిస్తుంది. విద్యార్థులకు అధ్యయనంలో ఉపయోగపడుతుంది. ప్రజల సంరక్షణలో సహాయకారిగా నిలుస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే.. కావాల్సిందల్లా కఠినమైన నియంత్రణ. మన ముందటి కొన్ని వందల తరాల సంపద మనిషి మేధ. ఈ నరావతరణ క్రమంలో కొన్ని లక్షల కోట్ల పనుల ఆధారంగా లభించిన ఆచరణాత్మక విజ్ఞానం, మంచి చెడ్డలను ఆలోచించగల వివేకం ఈ మేధలో నిక్షిప్తమై ఉంది. ఇది అపురూపం. సృష్టిలో మరో జీవికి లేని సొత్తు. దీనిని కాపాడుకుంటూ జీవితాన్ని ప్రగతిబాటన నడిపించుకోవాలి. ఆ క్రమంలో కృత్రిమ మేధ ఒక సాధనం మాత్రమే కావాలి. అది మనిషి అదుపులో ఉండాలి. కానీ.. దానికి మనిషే సాధనమవడం.. పాత తరాలకు మోసం.. భావితరాలకు చేయబోయే విద్రోహం!