Artificial Intelligence | ఏఐని మితిమీరి వాడుతున్నారా? అయితే భవిష్యత్తులో మీ పరిస్థితి అథోగతే!
నాలుగు నెలల కాలంలో వారి సామర్థ్యాలను, వారి మెదళ్లు స్వల్ప మార్పులకు ఎలా గురైందీ పరిశోధకులు గుర్తించారు. వ్యాసాలు రాసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించిన గ్రూపు విద్యార్థుల్లో ‘గణనీయమైన ప్రభావం’ కనిపించింది. నేర్చుకునే నైపుణ్యాలు సైతం వారిలో తగ్గిపోవడం గమనించారు.

Artificial Intelligence | అత్యంత వేగంగా ప్రధాన స్రవంతికిలోకి వచ్చేసిన సాంకేతిక పరిజ్ఞానం.. కృత్రిమ మేధ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనేక పనులు మునుపటికంటే వేగంగా, నాణ్యతతో అయిపోతున్నాయి. తగిన ఇన్‌పుట్ అందించడం ద్వారా చాట్‌జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్, జమినై వంటి అనేక చాట్‌బాట్‌లు పనిని సులభతరం చేస్తున్నాయి. ప్రత్యేకించి రాత విషయంలో చాట్ జీపీటీ అత్యంత ప్రజాదరణ పొందింది. అదే సమయంలో అది మిమ్మల్ని ఎందుకూ పనికిరానివారిలా.. మొద్దుబారిపోయేలా చేస్తుందని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరించింది.
చాట్‌జీపీ, ఇతర లార్జ్ లాంగ్విజ్ మోడల్స్ (LLM) ఉపయోగించి వ్యాసాలు రాసే విద్యార్థులు.. చాలా కనిష్ఠ జ్ఞాపకశక్తిని కలిగి ఉంటున్నారని ఈ అధ్యయనం తెలిపింది. తమ పనుల కోసం ఏఐ మీద ఆధారపడని విద్యార్థులతో పోల్చితే.. వారి మెదడు కార్యశీలత చాలా బలహీనంగా ఉందని తెలిపింది. 54 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్న మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) మీడియా ల్యాబ్.. వారి మెదళ్లు ఎలా స్పందిస్తున్నాయనే విషయంలో ప్రయోగాలు చేశారు. వ్యాసాలు రాసే సమయంలో వారి మెదళ్లలో ఎలక్ట్రికల్ యాక్టివిటీని కొలిచారు. వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు చాట్‌జీపీటీని వాడేది. మరొకటి గూగుల్‌ను ఉపయోగించేది. మూడవ గ్రూపునకు ఈ తరహా అవకాశం ఏదీ ఇవ్వలేదు. ఈ మూడు బృందాల్లోని విద్యార్థుల మెదళ్ల క్రియాశీలతను అంచనా వేశారు. ‘యువర్ బ్రెయిన్ ఆన్ చాట్‌జీపీటీ’ పేరుతో తమ అధ్యయన పత్రాన్ని సమర్పించారు.
నాలుగు నెలల కాలంలో వారి సామర్థ్యాలను, వారి మెదళ్లు స్వల్ప మార్పులకు ఎలా గురైందీ పరిశోధకులు గుర్తించారు. వ్యాసాలు రాసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించిన గ్రూపు విద్యార్థుల్లో ‘గణనీయమైన ప్రభావం’ కనిపించింది. నేర్చుకునే నైపుణ్యాలు సైతం వారిలో తగ్గిపోవడం గమనించారు. చాట్‌జీపీటీని ఉపయోగించడం వల్ల వారి పని మరింత మెరుగైందిగా కనిపించింది. కానీ.. దీర్ఘకాలంలో .. కేవలం తమ మెదడుపై మాత్రమే ఆధారపడిన వారితో పోల్చితే.. నాలుగు నెలల కాలంలో నాడీ, భాష వంటి వాటి స్కోరింగ్‌లో అధ్వాన్నమైన పనితీరు ప్రదర్శించారు’ అని అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. చాట్‌జీపీటీపై ఆధారపడి వ్యాసాలు రాసినవారు తమ మెదళ్లను తక్కువగా ఉపయోగించారని నిర్ధారించారు. అంతేకాదు.. అవి వారు స్వయంగా రాసిన వ్యాసాలు కాకపోవడంతో ఏం రాశారు? ఎవరిని కోట్ చేస్తూ రాశారు? అనే విషయాలను జ్ఞాపకం చేసుకోలేకపోయారని అధ్యయనంలో తెలిపారు. తమ స్వంత ఆలోచన ఆధారంగా రాసినవి కాకుండా, కృత్రిమ మేధను ఉపయోగించి రాయడం వల్లే ఈ పరిస్థితి వారికి ఎదురైందని తెలిపారు. గూగుల్ ఉపయోగించిన గ్రూపు విద్యార్థుల మెదళ్లలో ఓ మోస్తరు కదలికలు ఉన్నాయని, కానీ.. తమంతట తాముగా ఆలోచించి వ్యాసాలు రాసిన విద్యార్థుల్లో మెదడు కదలికలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
Artificial Intelligence | వామ్మో.. కృత్రిమ మేధతో ఇన్ని డేంజర్లా? నశించనున్న మానవ మేధ!
Artificial Intelligence | ఏఐతో ఆ మూడు ప్రొఫెషన్స్‌కు ఎలాంటి భయం లేదు! బిల్ గేట్స్ గుడ్ న్యూస్