భూమి వేగం పెరుగుతోందా? జిపిఎస్.. ఫైనాన్స్.. అన్నీ కుప్పకూలుతాయా?
ఈ మధ్య రోజులు త్వరగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోంది కదా. నెల తిరక్క ముందే మళ్లీ ఫస్ట్ వస్తున్నట్టు, ఈఎంఐలూ, ఇతర ఖర్చులూ అన్నీ నెత్తి మీద పడుతున్నట్టుందా? పొద్దున లేచామో లేదో అప్పుడే రాత్రి అయిపోయినట్టుంది కదా.. భూమి తిరిగే వేగం పెరిగిందట. అందుకేనేమో.. మనకు కూడా అలా అనిపిస్తోంది. మరి సైంటిస్టులు చెబుతున్న విషయాలేంటో చూద్దామా..

Earth Rotation Speed | రోజుకి 24 గంటలు అని ఎంత చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ తాజా అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. రోజుకి 24 గంటల కన్నా తక్కువగా ఉండొచ్చంటున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం సాధారణం కంటే కొంచెం ఎక్కువ పెరిగినట్టు చెబుతున్నారు సైంటిస్టులు. రోజులో 1.3 నుండి 1.5 మిల్లీ సెకను తక్కువగా నమోదవుతోందట. ఈ సంవత్సరం జూలై 9, జూలై 22, ఆగస్టు 5 తేదీలలో భూమి మరింత వేగంగా తిరిగిందని రికార్డులు చెబుతున్నాయి. ఇవి ఇప్పటివరకు రికార్డు అయిన చిన్న రోజులు. అంటే ఆయా రోజుల్లో భూమి తన యాక్సిస్ చుట్టూ సాధారణం కంటే వేగంగా తిరిగింది. దీని ప్రభావం మన శరీరంపై పెద్దగా తెలియకపోయినా, టెక్నాలజీ జీపీఎస్, అటామిక్ క్లాక్స్ వంటి వ్యవస్థలకు మాత్రం బలమైన షాక్. ఇలా ఎందుకు జరిగింది? దానిపై శాస్త్రవేత్తల్లో ఇంకా చర్చ జరుగుతోంది.
ఇది ఒక్కసారిగా జరిగిన అనుకోని పరిణామం కాదు. శాస్త్రవేత్తలు గత రెండు దశాబ్దాలుగా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో మార్పులను గమనిస్తున్నారు. 2020లోనే భూమి సగటు కంటే వేగంగా తిరిగిన 28 రోజులు రికార్డయ్యాయి. కారణాటేంటంటే.. భూమి లోపల లావా ప్రవాహాలు, టెక్టానిక్ ప్లేట్ కదలికలు కొన్నిసార్లు భూమి ఇనర్షియాను మార్చుతాయి. భూమి కేంద్రకం దగ్గర జరుగుతున్న ద్రవ లోహ కదలికలు భూమి వేగాన్ని ప్రభావితం చేయవచ్చని మాస్కో యూనివర్సిటీ పరిశోధకుడు లియోనిడ్ జోటోవ్ అభిప్రాయపడ్డారు. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు కరుగుతూ ఉండటం వల్ల సముద్ర మట్టం పెరిగి, భూభ్రమణంలో మార్పులకు దారితీస్తుందని ఇంకొక సిద్ధాంతం. కొన్ని ప్రత్యేక స్థితుల్లో చంద్రుడు భూమిపై వ్యతిరేక ప్రభావం చూపి, దాని వేగం పెరిగేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పులు, సముద్ర ప్రవాహాల లోతైన ప్రభావం కూడా భూభ్రమణం మీద పనిచేయగలవని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎల్-నినో, లా-నినా వంటి వాతావరణ మార్పులు గాలి ప్రవాహాలను, సముద్ర తరంగాలను ప్రభావితం చేస్తాయి. వీటివల్ల భూమి వేగం స్వల్పంగా మారవచ్చు.
ప్రభావాలు ఎక్కడ?
రోజులు 1 మిల్లీసెకండ్ తక్కువైనా మన నిద్ర, భోజనం, రోజువారీ లైఫ్ లో పెద్దగా మార్పు ఉండదు. కానీ టెక్నాలజీ వరల్డ్ లో మాత్రం వేరేగా ఉండొచ్చు. అటామిక్ క్లాక్స్ : ప్రపంచం యూనివర్సల్ టైమ్ (UTC) ను అనుసరిస్తుంది. ఈ టైమ్‌ను భూమి భ్రమణ వేగానికి సరిపోయేలా చేయడానికి లీప్ సెకండ్స్ జోడించేవాళ్లు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు లీప్ సెకండ్ తీయాల్సిన పరిస్థితి రావచ్చని అంటున్నారు. 2029లో ఇది జరిగే అవకాశం ఉందని కూడా లెక్కలు చెబుతున్నాయి. జిపిఎస్ – శాటిలైట్ నావిగేషన్ : వీటి విషయంలో నానోసెకండ్ స్థాయిలో ఖచ్చితత్వం అవసరం. భూమి వేగం మారితే సిగ్నల్ మిల్లీసెకండ్ల గ్యాప్ వస్తుంది. ఫలితంగా విమాన నావిగేషన్, మిలిటరీ కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్.. అన్నీ రిస్క్ లో పడొచ్చు. ఫైనాన్స్ సిస్టమ్ – స్టాక్ మార్కెట్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ సిస్టమ్‌లు టైమ్ ప్రెసిషన్‌పై ఆధారపడతాయి. ఒక మిల్లీసెకండ్ తప్పు బిలియన్ల డాలర్ల నష్టానికి దారి తీస్తుంది.
సిద్ధంగా లేకపోతే చిక్కే..
భూమి వేగాన్ని అటామిక్ క్లాక్స్ ద్వారా కొలుస్తారు. ఇవి నానోసెకండ్ ప్రెసిషన్‌లో సమయం కొలుస్తాయి. భూమి గణనలో లాగ్ వస్తే, లీప్ సెకండ్‌లు జోడించి లేదా తగ్గించి యూనివర్సల్ టైమ్ (UTC)ని సరిచేస్తారు. ఇప్పటివరకు ఎప్పుడూ అదనంగా లీప్ సెకండ్ జోడించేవాళ్లు. కానీ ఇప్పుడు తొలిసారిగా లీప్ సెకండ్ తీసేయాల్సి రావొచ్చు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 2029 కల్లా దీనికి అవకాశం ఉంది. అయితే, శాస్త్రవేత్తలలో చాలామంది ఇది తాత్కాలికమేనని చెబుతున్నారు. మరికొందరు మాత్రం, వందేళ్ల నుంచీ భూమి వేగం నెమ్మదిస్తున్నదీ, అప్పుడు తగ్గిన వేగానికి తాత్కాలిక విరామంగా ఇప్పుడు పెరుగుతున్నదనీ అంటున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. శాస్త్రవేత్తలు ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయినా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సంది ఏంటంటే, భూమి నిరంతరం ఒకే విధంగా తిరుగుతోందని అనుకోవడం భ్రమ. భూమి ఒక క్రమబద్ధమైన గడియారం కాదు. అది డైనమిక్, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కానీ ఇప్పుడే అటామిక్ టైమ్, టెక్ సిస్టమ్స్ సిద్ధంగా లేకపోతే, మిల్లీసెకండ్ కూడా పెద్ద సమస్య అవుతుంది.