Google Maps: గూగుల్ కొత్త ఫీచర్స్ గూగుల్​ మ్యాప్స్​లో ఇక ఫ్లైఓవర్లు, ఈవీ చార్జింగ్​ స్టేషన్లు

వినియోగదారుల సూచనల మేరకు గూగుల్​ తన మ్యాప్​ సర్వీస్​కు మరిన్ని ఆకర్షణలు జోడించింది. ఇకనుంచి మ్యాప్స్​లో ఫ్లైఓవర్లను, ఇరుకు సందులను, ఈవీ చార్జింగ్​ స్టేషన్లనూ చూపించనుంది. వచ్చే వారం రోజుల్లో ఈ సౌకర్యం ఆండ్రాయిడ్​ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్​ తెలిపింది.

Google Maps: గూగుల్ కొత్త ఫీచర్స్  గూగుల్​ మ్యాప్స్​లో ఇక ఫ్లైఓవర్లు, ఈవీ చార్జింగ్​ స్టేషన్లు

గూగుల్ మ్యాప్స్(Google Maps)​ – ఇవాళ ప్రతీ ఒక్కరూ తెలియని గమ్యాన్ని చేరుకోవడం కోసం, తాము రోజు వెళుతున్న దారిలోనే ఏవైనా ట్రాఫిక్​ జాం లాంటి ఇబ్బందులున్నాయా, ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని తెలుసుకోవడం కోసం వాడుతున్న పాపులర్​ యాప్​. గూగుల్​ నావిగేషన్​ లేకుండా ఇప్పుడు ఏ కారు కదలడం లేదు. దారి తెలియని ఊరికి వెళ్లాల్సివచ్చినా, భయపడకుండా నేరుగా గమ్యాన్ని చేరుకోగలగడం గూగుల్​ మ్యాప్స్​తో సాధ్యమవుతోంది. భారత్​లో ఇంకా కొన్ని యాప్​లు,యాపిల్​ మ్యాప్స్​, నావిమ్యాప్స్​, నావిక్​, మ్యాప్​ల్స్​ లాంటివి ఉన్నా, గూగుల్​ మ్యాప్స్​కు ఉన్నంత ఆదరణ మరే యాప్​కూ లేదు. భారత్​కు స్వంత నావిగేషన్​ వ్యవస్థ ఉంది. దాని పేరు నావిక్​(NaviC). ఇది ఏడు ఉపగ్రహాల సహాయంతో ఏర్పాటు చేసిన భారత జిపిఎస్​ వ్యవస్థ.

ఇక ఈ గూగుల్​ మ్యాప్స్​ గురువారం నాడు తమ యాప్​లో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లు అందిస్తున్నామని, ఇవన్నీ కూడా ప్రజల నుండి వచ్చిన సూచనల మేరకు మ్యాప్స్​లో పొందుపరుస్తున్నామని గూగుల్​ మ్యాప్స్​  వైస్​‌‌–ప్రెసిడెంట్​ మిరియం డేనియల్​( Miriam Daniel, VP and GM, Google Maps) తెలిపారు. కృత్రిమ మేధతో(Aritificial Intelligence) పనిచేసే ఇవి ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని ఇస్తూ, ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ఆమె తెలిపారు. వీటిలో ఇరుకు సందుల(Narrow Roads) గురించిన సమాచారం. ఫ్లైఓవర్ల(Flyover Callout) సూచన, విద్యుత్​ చార్జింగ్​ స్టేషన్ల(EV ChargingStation info) సమాచారాన్ని పొందుపరిచినట్లు మిరియం చెప్పారు.

ఇరుకు సందులు(Narrow Roads):

కారులో వెళ్లేప్పుడు, ఇరుకు సందుల గుండా ప్రయాణించాల్సివచ్చిన సమయంలో, ఆ సందులో కారు పడుతుందా? లేదా అనేది దాని వెడల్పు ఆధారంగా గుర్తించి వాహనదారుడికి హెచ్చరిక పంపుతుంది. ఇదో గొప్ప ఫీచర్​. ముఖ్యంగా భారత్​ లాంటి రోడ్ల వ్యవస్థ ఉన్న చోట తప్పనిసరిగా కావాల్సిన సమాచారం. ఈ రోడ్డు వెడల్పు తెలుసుకోవడానికి తాము ఒక ఏఐ మాడల్​ను రూపొందించామని, అది రకరకాల సమాచారాన్ని అంటే, ఉపగ్రహ చిత్రాలు, స్ట్రీట్​ వ్యూ, భవంతుల మధ్య దూరాలు, రోడ్డు రకాల ఆధారంగా రోడ్డు వెడల్పును(Estimates Road width) అంచనా వేసి, వాహనం ఆ దార్లో వెళ్లగలదా లేదా అనేది సూచిస్తుంది.

ఫ్లైఓవర్లు(Flyovers):

ఇంకో సౌలభ్యం.. ఫ్లైఓవర్ల సమాచారం. మనం వెళుతున్న దారిలో ఉన్న ఫ్లైఓవర్ల గురించి అది రావడానికి ముందుగానే మనల్ని అలర్ట్​ (Flyover Callout)చేస్తుంది. దాంతో మనం ఈజీగా ఫ్లైఓవర్​ ఎక్కవచ్చు. సడన్​గా ఒక ఫ్లైఓవర్​ వస్తే వాహనాన్ని దానిమీదకు మళ్లించడంలో ఇప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఫీచర్​ వల్ల ముందుగానే ఫ్లైఓవర్​ అలర్ట్​ వస్తుంది కాబట్టి నిశ్చింతగా అటువైపు మళ్లొచ్చు.

ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV Charging Stations):

విద్యుత్​ వాహనాల(Evs) కోసం ఇకనుండి గూగుల్​ మ్యాప్స్​లో విద్యుత్​ చార్జింగ్​ స్టేషన్ల(Charging Stations) సమాచారం కూడా అందిస్తున్నామని గూగుల్​ తెలిపింది. ఇది గూగుల్​ మ్యాప్స్​లోను, గూగుల్​ సెర్చ్​లోనూ అందుబాటులో ఉంటుందన్న మిరియం, తాము ఈ విషయమై భారత్​లో ప్రముఖ ఈవీ చార్జింగ్​ ప్రొవైడర్లైన అథెర్​(Ather), కాజమ్(Kazam)​, ఎలక్ట్రిక్​ పె(ElectricPe), స్టాటిక్(StatiQ)​లతో అవగాహనకు వచ్చామని, దేశవ్యాప్తంగా 8000కు పైగా చార్జింగ్​ స్టేషన్ల అధికారిక సమాచారాన్ని ఇవ్వబోతున్నామని ఆమె తెలిపారు.

ఈ సౌలభ్యాలను భారత ప్రముఖ నగరాలైన హైదరాబాద్​, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్​, భువనేశ్వర్​, గువాహటీ(Hyderabad, Bengaluru, Chennai, Coimbatore, Indore, Bhuvaneshwar, Guwahati) లలో ఈ వారంలోనే(Available this week) అందిస్తామని గూగుల్​ తెలిపింది. ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్​ వినియోగదారులకే అందుబాటులోకి వస్తుందని, త్వరలోనే యాపిల్​ (iOS)వినియోగదారులకు, కార్​ప్లే(Carplay)కు మరిన్ని నగరాలను జోడించి అందిస్తామని హామీ ఇచ్చారు.

గూగుల్​ ఈ సందర్భంగా మ్యాప్స్​ విశేషాలు తెలియజేస్తూ, ప్రతీరోజు తాము దాదాపు 6 కోట్ల మంది ప్రజల నుండి రివ్యూలు, అప్​డేట్​లు అందుకుంటామని, ఇప్పటివరకు 70 లక్షల కిలోమీటర్ల రోడ్లను, 30 కోట్ల భవంతులను, 3.5 కోట్ల వ్యాపారాలను, ఇతర ప్రదేశాలను మ్యాప్​ చేసామని, స్ట్రీట్​ వ్యూ(Street View), లైవ్​ వ్యూ(Live View)లాంటి అనుభవాలను కూడా వినియోగదారులకు అందిస్తున్నామని గూగుల్​ ప్రకటించింది.