గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని.. కాలువలో కొట్టుకుపోయిన హైదరాబాదీలు

ఒక్కోసారి గూగుల్‌ను నమ్ముకుంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తిప్పిన చోటే తిప్పుతూ ఉంటుంది. ఇలాగే గూగుల్‌ మ్యాప్‌లపై ఆధారపడి కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిన నలుగురు హైదరాబాదీలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక కాలువలో చిక్కుకుపోయారు

గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని.. కాలువలో కొట్టుకుపోయిన హైదరాబాదీలు

అలప్పుళ: ఒక్కోసారి గూగుల్‌ను నమ్ముకుంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తిప్పిన చోటే తిప్పుతూ ఉంటుంది. ఇలాగే గూగుల్‌ మ్యాప్‌లపై ఆధారపడి కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిన నలుగురు హైదరాబాదీలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక కాలువలో చిక్కుకుపోయారు. అయితే.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కేరళలోని అలప్పుళ వెళుతుండగా చోటు చేసుకున్నది. రాత్రిపూట ఫోర్డ్‌ ఎన్‌డీవర్‌ కారును నడుపుతున్న డ్రైవర్‌.. నావిగేషన్‌ యాప్‌లో చూపించిన మేరకు ఎడమవైపు టర్న్‌ తీసుకున్నాడు. కానీ.. ఆ రోడ్డుపై ఉధృతంగా వాననీరు ప్రవహిస్తున్నది. తాము ఇంకా రోడ్డుపైనే ఉన్నామని ఆ పర్యాటకులు భావించారు.

కానీ.. అప్పటికే ఆ కారు.. కాలువలోకి వెళ్లిపోయింది. ఆ కారులోని ఒక వ్యక్తి అతికష్టం మీద బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పాడు. వారంతా కలిసి.. కారులో చిక్కుబడిపోయినవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈలోపు విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న మిగిలిన ముగ్గురిని రక్షించారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వాహనాన్ని కాలువ నుంచి బయటకు తీసుకువచ్చారు. 2023లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్నది. ఆ ఉదంతంలో ఇద్దరు డాక్టర్లు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా కారు నడిపి.. కాలువలో కొట్టుకుపోయి చనిపోయారు. సో.. వానాకాలం అందులో రాత్రిపూట గూగుల్ మ్యాప్‌ ఎటు చూపితే అటు గుడ్డిగా వెళ్లిపోకండి. ఆ దారిలో రోడ్డే ఉన్నదో నీళ్లే ఉన్నాయో తెలియదు. జాగ్రత్త