Microsoft | “కొత్త మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ అన్నీ గుర్తుపెట్టుకుంటుంది”
రెడ్మండ్, వాషింగ్టన్: బిల్డ్ 2024 ఈవెంట్‌కు ముందుగానే, మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. తాము ఓ కొత్త ప్రపంచపు కంప్యూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త కంప్యూటర్లు కృత్రిమ మేధలోని అతి క్లిష్టమైన పనులను కూడా సులభంగా చేయగలవని మైక్రోసాఫ్ట్(Microsoft) సిఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) తెలిపారు.

– కోపైలట్+ పీసీల ఆవిష్కరణ సందర్భంగా సత్య నాదెళ్ల
– యాపిల్ మ్యాక్‌బుక్ ప్రొ నూ దాటేస్తాం
– రీకాల్ అనే ఫీచర్ కంప్యూటర్‌పై మనం చేసే, చూసేవన్నీ ట్రాక్ చేస్తుంది
ఆయన ఆవిష్కరించిన ఈ కంప్యూటర్ను కోపైలట్+ పీసీలు(Copilot+ PC)గా పిలవొచ్చని చెప్పిన నాదెళ్ల, ఇంతవరకు కనీవినీ ఎరుగని అత్యంత వేగవంతమైన, అపరిమిత మేధస్సు కలిగిన మొట్టమొదటి విండోస్ కంప్యూటర్‌గా దీన్ని అభివర్ణించారు. దీని గురించి వాల్ స్ట్రీట్ జర్నల్(WSJ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కోపైలట్+ పిసీలో పొందుపరిచిన విశేషాలను పంచుకున్నారు. డెల్ టెక్నాలజీస్, క్వాల్కామ్, ఇంటెల్, ఏఎండీల సహకారంతో ఈ పీసీలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. క్వాల్‌కాం ఎక్స్ సిరీస్ ప్రాసెసర్‌తో రాబోతున్న ఈ పీసీ, ఏఐ పనుల భారాన్ని తనే చూసుకుంటుందని, దానికి ఎక్స్ ఎలైట్(Snapdragon X Elite) ప్రాసెసర్‌లో ఉన్న అత్యధిక పనితీరును కలిగిన 8 కోర్లు, 4 అధిక సామర్థ్యం కలిగిన కోర్లు సహకరిస్తాయని ఆయన అన్నారు. 40 టాప్స్ (ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్) వేగంతో ఈ పీసీ పనిచేస్తుందని, ఇదంతా రోజుకు కేవలం ఒకే ఒక్క చార్జింగ్తోనే సాధ్యమని వివరించారు.
ఈ పీసీలు అత్యంత అధునాతన ఏఐ ఉపకరణాల(AI Tools)తో ఉన్నాయి. కోక్రియేటర్(Cocreator) సహాయంతో రియల్‌టైమ్‌లో ఏఐ ఆధారిత చిత్రాలను సృష్టించడం, వాటికి మెరుగులు దిద్దడం లాంటి వాటితో పాటు, భాషాపరమైన అన్ని సమస్యలను పరిష్కరించనుంది. దాదాపు 40 భాషల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ, లైవ్ వ్యాఖ్యలను జోడించడం, ఆ భాషల విడియోలనుండి ఇంగ్లీష్‌కు తర్జుమా చేయడం వంటి అత్యంత ఉపయోగకరమైన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ల్యాప్‌టాప్ యాపిల్(Apple) మ్యాక్‌బుక్ ప్రొ(Macbook Pro)ను అధిగమించడమే తమ లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఈ మధ్యనే యాపిల్ విడుదల చేసి సంచలనం సృష్టించిన ఐప్యాడ్ ప్రొ(iPad Pro 2024) ఏకంగా 48 టాప్స్ వేగంతో పనిచేయగలగడం గమనార్హం.
ఈ పీసీలో ఉన్న అతి ముఖ్యమైన ఫీచర్ – రీకాల్(Recall). ఇదొక ఫోటోగ్రాఫిక్ మెమొరీ లాంటిది. అంటే ఏకసంథాగ్రాహి అనవచ్చునేమో. ఇకనుండీ మనం కంప్యూటర్‌పై ఏం చేస్తున్నదీ, ఏం చూస్తున్నదీ.. అన్నీ ఇది గుర్తుపెట్టుకుంటుంది.
ఇది మనం సాధారణంగా కంప్యూటర్‌పై రోజూ చేసే పనులను, చూసేవన్నింటినీ ట్రాక్ చేస్తుంది. అంటే, ప్రతీ టాస్క్‌ను ఒక స్క్రీన్‌షాట్‌లా తీసుకుని దాచుకుంటుంది. మనకు ఎప్పుడైనా గతంలో చేసిన ఏదైనా పనో, వాడిన ఫైలో అవసరమైనప్పుడు ఈ రీకాల్ తక్షణమే దాన్ని వెతికిపెడుతుంది. ఈ రీకాల్ ఫీచర్‌కు వినియోగదారుడే అన్ని రకాల అనుమతులు ఇవ్వాల్సిఉంటుంది. విండోస్ 11(Windows 11)లో దీన్ని ప్రవేశపెడుతున్నారు. ఇదే ఈవెంట్లో సత్య నాదెళ్ల స్వరాధారిత కృత్రిమ మేధ సహాయకుడ్ని(AI Assistant) కూడా పరిచయం చేసారు. పీసీలో గేమ్ ఆడుతున్న ఒక వినియోగదారుడికి ఈ ఏఐ కోచ్ సలహాలివ్వడాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ఇంతకుముందే ఉన్న ఏఐ సౌలభ్యాలన్నింటినీ కలగలుపుకుంటూ, కోపైలట్+ పీసీ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కోపైలట్+ పీసీ త్వరలోనే ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ 4ఓ(ChatGPT 4o)ను కూడా కలుపుకుంటుందని మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి ఒకరు తెలియజేసారు.
ఈ పీసీతో పాటు మైక్రోసాఫ్ట్ తన కొత్త సర్ఫేస్ ట్యాబ్లెట్(Surface Tablet)ను, సర్ఫేస్ ల్యాప్‌టాప్(Surface Laptop)ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త కోపైలట్+ పీసీలను తనతో పాటు తమ ఓఈఎం భాగస్వాములైన అసుస్, డెల్, సామ్సంగ్, హెచ్‌పీ, ఏసర్, లెనోవో కూడా విడుదల చేస్తాయని, ఈరోజు నుండే ముందస్తు ఆర్డర్లు చేయవచ్చునని, జూన్ 18 నుండి సరఫరా ప్రారంభమవుతుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
అయితే, మరోపక్క ఈ రీకాల్ ఫీచర్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి ఒక ఎక్స్ యూజర్ ఎలన్ మస్క్(Elan Musk)కు షేర్ చేయగా, ఆయన దీన్నొక బ్లాక్ మిర్రర్(Black Mirror) ఎపిసోడ్‌గా అభివర్ణించారు (బ్లాక్ మిర్రర్ అనేది బ్రిటన్‌లో ప్రఖ్యాతి పొందిన టీవీ సీరీస్. ఇందులోని ఎపిసోడ్లు, సాంకతికత వికృత పోకడల వల్ల జరిగే నష్టాలను వ్యంగ్యంగా చూపిస్తాయి). నేనైతే ఈ ఫీచర్‌ను అసలు ఆన్ చేయను అని మస్క్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారిన వ్యక్తిగత గోప్యత(Privacy) దీంతో మరింత బజార్న పడుతుందని సాంకేతిక నైతికత నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు వినియోగదారుడే ఇవ్వాల్సిఉన్నా, బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే సమాచార మార్పిడి ఇప్పటికే ఫేస్బుక్(Facebook)ను కష్టాల్లోకి నెట్టేసిందని, గూగుల్(Google) కూడా ఇదే పని చేస్తుందని, ఇప్పుడు ఈ రీకాల్‌తో ప్రపంచంలో ప్రైవసీ అనేదే లేకుండా పోతుందని వారు వాపోయారు.