మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
రివర్‌ఫ్రంట్‌లో సుమారు 10,200 మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతకు కాస్త ఎక్కువగానే.. 16వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌లో మురికికూపంగా మారిన మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే .. ఈ ప్రాజెక్టులో వేల సంఖ్యలో పేదలు తమ గూడును కోల్పోనున్నారు. ఆ ఇబ్బంది కలుగకుండా మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే కుటుంబాల కోసం 16వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదీ గర్భంలో, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కలిగినవారికి పునరావాసం కోసం వీటిని ఉపయోగిస్తారు. రివర్‌ఫ్రంట్‌లో సుమారు 10,200 మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతకు కాస్త ఎక్కువగానే.. 16వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రంగారెడ్డి, హైదరాబాద్, ముడ్చల్ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఆయా ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎక్కడ కేటాయించనున్నారో తెలియజేయనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందుగా రివర్ బెడ్‌లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. 2 BHK ఇల్లు కూడా కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు రేపు ప్రారంభిస్తారు.