Heavy Rain | హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. బేగంబజార్‌లో అత్యధికంగా 11.7 సెం.మీ. వర్షపాతం నమోదు
Heavy Rain | హైదరాబాద్( Hyderabad ) నగరాన్ని మరోసారి భారీ వర్షం( Heavy Rain ) ముంచెత్తింది. ఈ భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. శనివారం రాత్రి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. బేగం బజార్( Begum Bazar )లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

Heavy Rain | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) వ్యాప్తంగా శనివారం రాత్రి వాన దంచికొట్టింది. రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి( Heavy Rain ) భాగ్యనగరం అతలాకుతలమైంది. గురువారం నాటి పరిస్థితులు హైదరాబాద్ నగరంలో మళ్లీ తలెత్తాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్‌తో నరకయాతన అనుభవించిన ప్రజలు.. రాత్రి ఉన్నట్టుండి వాన దంచికొట్టడంతో ఊపిరి పీల్చుకోలేకపోయారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి.
శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నాంపల్లి పరిధిలోని బేగంబజార్( Begum Bazar )లో అత్యధికంగా 11.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చార్మినార్( Charminar ) పరిధిలోని సర్దార్ మహల్‌లో 10.6 సెం.మీ., ఖైరతాబాద్‌లో 9.4, నాంపల్లిలో 9.2, ఆసిఫ్‌నగర్‌లో 9.1, హయత్‌నగర్‌లో 9.0, ముషీరాబాద్‌లో 8.6, హిమాయత్‌నగర్‌లో 8.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ నగరంలో ఒక్క ఆగస్టు నెలలోనే 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదు అవ్వడం ఇది మూడోసారి అని వాతావరణ శాఖ అధికారులు తేల్చారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో ఈ మాదిరిగానే కుండపోత వర్షాలు కురుస్తాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.