Telangana Budget 2024 | బడ్జెట్ పై 73% పెరిగిన వడ్డీ చెల్లింపుల భారం
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం 73 శాతం పెరిగిందని తెలిపింది.

రుణ అనుమతి 29.70 శాతానికి
తీసుకున్నది మాత్రం 35.64 శాతం
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ ఆందోళన
ఉద్యోగుల పెన్షన్ సొమ్మూ వదల్లేదు
సభ అనుమతి లేని పథకాలకు ఖర్చు
భారీగా పెరిగిన పెండింగ్ ప్రాజెక్టులు
విధాత: రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం 73 శాతం పెరిగిందని తెలిపింది. ఇది మంచిది కాదని పేర్కొన్నది. రాష్ట్ర బడ్జెట్‌లో 33 శాతం వడ్డీల చెల్లింపులకే పోతుందన్నది. అప్పులపై రాష్ట్రం ఆధార పడటం వనరుల వినియోగం మీద ప్రభావం చూపుతుందని కాగ్ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తన బడ్జెట్ లో 44 శాతం రుణాలపై ఆధార పడిందని ఈ సందర్భంగా తెలిపింది. మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలను తీర్చడానికి పన్నెండవ ఆర్థిక సంఘం రుణ వియోచన నిధిని ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ నిధిని రిజర్వ్ బ్యాంకు నిర్వహిస్తున్నది. మార్గదర్శకాల ప్రకారం క్రమం తప్పకుండా నిధులు జమ చేయడం లేదని పేర్కొన్నది. 2021 నుంచి మార్చి 23 వరకు నిధులు జమచేసినట్లుగా చూపించలేదు. రుణవిమోచన నిధికి తరచూ జమ చేయకపోవడం వల్ల, తక్కువగా జమ చేయడం వల్ల అసలు ప్రయోజనం దెబ్బతింటుందని తెలిపింది.
బడ్జెట్ వెలుపలి రుణాలపై పద్ధతి మార్చుకోవాలి
బడ్జెట్ వెలుపలి రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని కాగ్ సూచించింది. ముఖ్యంగా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే బాధ్యతలనే ఆయా సంస్థలకు ఇచ్చినట్లుగా చూపించడాన్ని తప్పు పట్టింది. బడ్జెట్టేర రుణాల వివరాలను బడ్జెట్ పత్రాలలో వెల్లడించకపోవడం 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు విరుద్ధమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలకు రుణాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు వ్యవధి, వాయిదాల సంఖ్య వంటి రుణ నిబంధలను విధించడం లేదని కాగ్ పేర్కొన్నది. రుణాల వసూళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు కార్ల కొనుగోలుకు తీసుకున్న రుణాలే అధికంగా ఉన్నాయని తెలిపింది.
ఉద్యోగుల పెన్షన్ సొమ్ము రూ. 1,073 కోట్లకు ఎసరు
రాష్ట్ర ప్రభుత్వంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత సర్కారు పెన్షన్ ఇవ్వదు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము నుంచే పెన్షన్ ఇస్తారు. ఈ మేరకు ఈ పథకం కింద ఉద్యోగుల మూల వేతనం, కరువు భత్యాలలో 10 శాతం మొత్తాన్ని ఉద్యోగులు ప్రతి నెల తమ వాటాగా చెల్లిస్తారు. దీనికి సమానమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాలి. ఉద్యోగుల నుంచి కట్ చేసిన సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం యజమాని వాటా కింద ఇచ్చే సొమ్మును కలిపి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్ డీ ఎల్) కింద ట్రస్టీ బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం జమ చే యాలి. కానీ దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి చివరి నాటికి ప్రభుత్వ వాటా సొమ్ము రూ.2,528 కోట్లు జమ చే యాల్సి ఉండగా కేవలం రూ.1,253కోట్లను జమ చేసి, మిగిలిన రూ.1,073 కోట్లను జమ చేయలేదని తెలిపింది. అయితే రాష్ట్ర విభజన తరువాత 2019-23 కాలానికి మధ్య పంపకాలేవీ జరుగకపోవడంతో 2023 మార్చి నాటికి ఇంకా రూ.365 కోట్లను పంచాల్సి ఉందని కాగ్ తెలిపింది.
సభ ఆమోదం లేకుండా ఖర్చులా?
పలు పథకాలకు శాసన సభ ఆమోదం లేకుండా పదే పదే ఖర్చు చేయడం శాసన సభ సాధికారతను తగ్గించినట్లు అవుతుందని కాగ్ తెలిపింది. బీఆరెస్ ప్రభుత్వం శాసన సభ ఆమోదం లేకుండా2022-23 సంవత్సరంలో 8,985 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. 2021-22లో సభ అనుమతి లేకుండా రూ. 1 383 కోట్లు చేసిందని పేర్కొన్నది. ఇలా ఖర్చు చే యడం ఆర్థిక పరమైన ఉల్లంగనే కాకుండా ప్రజా వనరుల నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి దారి తీస్తుందని కాగ్ హెచ్చరించింది. అంతే కాకుండా బీఆరెస్ సర్కారు 2020-21 నుంచి 23 మార్చి వరకు భారీ ఎత్తున హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించి, వినియోగించలేదని కాగ్ పేర్కొన్నది. 2020-21లో రూ. 10 వేల కోట్ల కేటాయించిన బీఆరెస్ సర్కారు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం. ఉదయ్ స్కీమ్ కింద ప్రభుత్వం తీసుకున్న నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఖర్చుల పద్దుగా రాయడాన్ని కాగ్ తప్పుపట్టింది.
భారీగా పెరిగిన పెండింగ్ ప్రాజెక్టుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెండింగ్ ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరిగిందని కాగ్ తెలిపింది. దీని వల్ల లక్ష కోట్లకు పూర్తికావాల్సిన ఆయా ప్రాజెక్టుల వ్యయం 2లక్షల కోట్లు దాటిందని పేర్కొన్నది. ఇందులో అత్యధిక వాటా సాగునీటి ప్రాజెక్టులదేనని స్పష్టం చేసింది. 1983 నుంచి 2018 మధ్య కాలంలో ప్రారంభమై, 2023 మార్చినాటికి పూర్తి కావాల్సిన సాగునీటి ప్రాజెక్టులు 20 వరకు ఉన్నాయి. వీటి అంచనా వ్యయం రూ.1,02,388 కోట్లు కాగా.. సకాలంలో పూర్తి చేయకపోవడంతో 102 శాతం పెరిగి రూ.2,06, 977 కోట్లకు చేరిందని కాగ్ తెలిపింది. ఇలా వివిధ రంగాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 280 పనులు నేటికీ పెండింగ్ లో ఉన్నాయని కాగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏ శాఖ నుంచి ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయో తన నివేదికలో వివరించింది.