Godavari | మహారాష్ట్ర నుంచి 796 టీఎంసీల నీరు విడుదల.. గోదావరికి పోటెత్తిన వరద..!
Godavari | కృష్ణా నది( Krishna River )కి వరద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ మాదిరిగానే గోదావరి నది( Godavari River )పై నిర్మించిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు( SRSP ) కూడా నిండు కుండలా మారనుంది. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా మరాఠ్వాడా రీజియన్(Marathwada Region)లోని అనేక సాగునీటి ప్రాజెక్టు నుంచి రికార్డు స్థాయిలో 796 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడమే.

Godavari | హైదరాబాద్ : మహారాష్ట్ర( Maharashtra )లో గత కొద్ది రోజుల నుంచి కుండపోత వర్షాలు( Downpour ) కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలు, వరదలకు మరాఠ్వాడా రీజియన్( Marathwada Region )లోని పలు సాగునీటి ప్రాజెక్టులు( Irrigation Projects ) నిండు కుండలా మారాయి. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా వివిధ ప్రాజెక్టుల నుంచి దిగువన ఉన్న తెలంగాణ( Telangana ) వైపునకు రికార్డు స్థాయిలో 796 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు గోదావరి మరాఠ్వాడా ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GMIDC) తెలిపింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అయితే 796 టీఎంసీల నీటి విడుదల అనేది జయక్వాడి ఆనకట్ట( Jayakwadi Dam ) నిల్వ సామర్థ్యం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ఈ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి విడుదల జరిగిందని అధికారులు తెలిపారు. మరాఠ్వాడా రీజియన్‌లో జయక్వాడి ప్రధాన సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 102 టీఎంసీలు అని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జయక్వాడి ఆనకట్టతో పాటు, పలు ప్రాజెక్టులు కూడా పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.
జయక్వాడి ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, విష్ణుపురి ప్రాజెక్టు( Vishnupuri Project ) యొక్క మొత్తం 17 గేట్లు ఎత్తినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు మరాఠ్వాడా రీజియన్‌లోని పలు నదులకు కూడా రికార్డు స్థాయిలో వరద పోటెత్తిందని, దీంతో నిండు కుండలా మారాయన్నారు. మొత్తంగా మరాఠ్వాడా రీజియన్ నుంచి విడుదల చేస్తున్న నీరు.. గోదావరి వైపు ఉరకలేస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.