చిన్నారి త‌ల‌లో గుచ్చుకున్న పెన్ను.. మెద‌డుకు తీవ్ర గాయం కావ‌డంతో పాప మృతి

ఓ ఐదేండ్ల చిన్నారి త‌ల‌లో పెన్ను గుచ్చుకుంది. మెద‌డుకు తీవ్ర గాయం కావ‌డంతో చికిత్స పొందుతూ ఆ పాప ప్రాణాలు విడిచింది

చిన్నారి త‌ల‌లో గుచ్చుకున్న పెన్ను.. మెద‌డుకు తీవ్ర గాయం కావ‌డంతో పాప మృతి

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : ఓ ఐదేండ్ల చిన్నారి త‌ల‌లో పెన్ను గుచ్చుకుంది. మెద‌డుకు తీవ్ర గాయం కావ‌డంతో చికిత్స పొందుతూ ఆ పాప ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా భ‌ద్రాచ‌లంలోని సుభాష్‌న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణంలోని సుభాష్‌న‌గ‌ర్‌కు చెందిన రియాన్షిక‌(5) త‌న ఇంట్లో మంచంపై కూర్చొని ఆడుకుంటోంది. ఇక త‌న చేతిలోకి పెన్ను తీసుకుని పుస్త‌కంలో రాసుకుంటుండ‌గా, ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ పాప కింద ప‌డిపోయింది. దీంతో ఎడ‌మ చెవి పైభాగంలో త‌ల‌లో ఆ పెన్ను గుచ్చుకుంది. దాదాపు స‌గానికి పైగా పెన్ను ఆ పాప త‌ల‌లో దిగింది.

దీతో అప్ర‌మ‌త్త‌మైన రియాన్షియ‌క త‌ల్లిదండ్రులు భ‌ద్రాచ‌లం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం ఖ‌మ్మంలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ స‌ర్జ‌రీ నిర్వ‌హించి, పెన్నును తొల‌గించారు. ఇక పాప బ‌తికి బ‌య‌ట‌ప‌డింద‌ని త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ పెన్ను మెద‌డుకు బ‌లంగా తాకిన‌ట్లుంది. బ్రెయిన్‌లో ఇన్‌ఫెక్ష‌న్‌కు గురి కావ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చిన్నారి బుధ‌వారం క‌న్నుమూసింది.

రియాన్షిక తండ్రి మ‌ణికంఠ భ‌ద్రాచ‌లంలో మెకానిక్‌గా ప‌ని చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. పాప చ‌నిపోయింద‌న్న విష‌యం తెలుసుకుని మ‌ణికంఠ బోరున విల‌పించాడు. వైద్యం కోసం రూ. 2 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాన‌ని, అయినా పాప బ‌త‌క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.