GHMC | జీహెచ్ఎంసీ.. నా పెళ్లాం.. పిల్లలు ఎక్కడ..? ఓ మగాడి మూగ రోదన ఇదీ..!!
తను ఎంతో ఇష్టపడే భార్య, అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కూతురు, కుమారుడు కనిపించకుండా పోయారు. దీంతో ఆ మగాడు మూగ రోదనతో మానసికంగా కుంగిపోతున్నాడు.

ఒక రోజు అతని చుట్టూ అతని భార్యాపిల్లలు ఉన్నారు. ఎంతో సంతోషంగా, హాయిగా పెళ్లాంపిల్లలతో కలిసి ఉన్న అతనికి కొద్ది రోజుల తర్వాత షాక్ తగిలింది. ఉన్నట్టుండి తను ఎంతో ఇష్టపడే భార్య, అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కూతురు, కుమారుడు కనిపించకుండా పోయారు. దీంతో ఆ మగాడు మూగ రోదనతో మానసికంగా కుంగిపోతున్నాడు. జీహెచ్ఎంసీ….. నా పెళ్లాం.. ఇద్దరు పిల్లలు ఎక్కడ..? అని ప్రాధేయపడుతున్నాడు. కానీ జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు మాత్రం కనీసం అతని బాధను ఆలకించడం లేదు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం పలు కూడళ్లను ఎంతో అందంగా, రమణీయంగా తీర్చిదిద్దింది. హైదరాబాదీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా సృజనాత్మకతతో కూడిన బొమ్మలను ఆయా కూడళ్లలో ఏర్పాటు చేసింది.
అయితే జూబ్లీహిల్స్ ప్రాంతంలోని నార్నే రోడ్డులో ఉన్న పేవ్‌మెంట్‌పై ఒక కుటుంబాన్ని వర్ణించే ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌ను 2021లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. దంపతులిద్దరూ తమ పిల్లలతో కలిసి ఉన్న ఆర్ట్ అది. తండ్రేమో తన కూతురిని, తల్లేమో తన కుమారుడిని చేతులతో పట్టుకుని ఉన్న అద్భుతమైన దృశ్యం అది.
ఆ ఆర్ట్‌ను చూస్తే ఏ చిన్న కుటుంబానికైనా తెగ సంతోషమేస్తది. మరి ఎంతో చక్కనైన, చూడముచ్చటైనా ఆ ఆర్ట్‌లో మూడు బొమ్మలు మాయం అయ్యాయి. కేవలం ఆ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో పురుషుడి ఆర్ట్ మాత్రమే ఉంది. అతని భార్యాపిల్లలు అదృశ్యమయ్యారు. దీంతో ఆ కూడలికి ఉన్న అందం అంతా బోసిపోయింది. అయితే మిగతా బొమ్మల అదృశ్యంపై జీహెచ్ఎంసీ ఇంత వరకు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
సంబంధిత ఇంజినీర్లు కూడా స్పందించడం లేదన్నారు. అసలు ఆ కుటుంబం ఎక్కడ..? పునరుద్ధరణ కోసం వాటిని అధికారులు తొలగించారా..? లేక ఎవరైనా దొంగిలించారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ సమాధానం మాత్రం లభించడం లేదు.