BRS MLA’S Defection Case Hearing | ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో అసెంబ్లీ స్పీకర్ బిజీ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం మరో నాలుగు కేసుల్లో మౌఖిక వాదనలు విన్నారు. ఈ నెల 31లోగా విచారణ పూర్తిచేసి, కడియం, దానం నాగేందర్ సహా అందరిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

BRS MLA’S Defection Case Hearing | ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో అసెంబ్లీ స్పీకర్ బిజీ

విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం మరోసారి విచారణ కొనసాగించారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన తొలి దశ విచారణలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను శుక్రవారం నుంచి చేపట్టారు. ఉదయం 11గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ కేసు, మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు, 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు, మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ ప్రక్రియ కొనసాగించారు.

ప్రతి కేసులోను ఇరువర్గాలు స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించాయి. ఇప్పటికే ఇరువర్గాలు కూడా తమ వాదనలకు మద్దతుగా ఆధారాలు, అఫిడవిట్లు స్పీకర్ కి అందజేశారు. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈరోజు నుంచి 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈనెల 25 నుంచి 31లోగా మిగిలిన ఎమ్మెల్యేలపై విచారణను పూర్తి చేయనున్నారు. ఇప్పటివరకూ స్పీకర్ నోటీసులకు సమాధానాలివ్వని కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై కూడా ఈలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‎ను జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు వెలువరించే సందర్భంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‎లో ఉంచడం సరికాదని.. ఆలస్యం జరిగే కొద్ది ఫిరాయింపుదారులు ప్రయోజనం పొందుతారని.. ఇలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలే యాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల) ఉన్నారు.