రిజర్వేషన్ల వివాదంతో తర్జనభర్జనలు.. బీహార్‌ ఎన్నికల తర్వాత పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు?

స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను పార్టీ నాయకత్వం ముందుకు తెస్తున్నది. అదే సమయంలో ఎన్నికలను వాయిదా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి

రిజర్వేషన్ల వివాదంతో తర్జనభర్జనలు.. బీహార్‌ ఎన్నికల తర్వాత పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు?
  • బీహార్‌ ఎన్నికల తర్వాతే లోకల్‌ ఫైట్‌?
  • రిజర్వేషన్ల వివాదంతో తర్జనభర్జనలు
  • పార్టీపరంగా 50 శాతం కావాల్సిందే
  • ఓడిపోయే స్థానాలు మాకెందుకు?
  • నాయకత్వాన్ని నిలదీస్తున్న బీసీ నేతలు
  • పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు?

హైదరాబాద్, ఆగస్ట్ 25 (విధాత) : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ విషయంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నది. విద్య, ఉద్యోగాలతోపాటు రాజకీయంగా పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్లులు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇవి పెండింగ్‌లో ఉండటంతో ఆర్డినెన్స్‌ను సైతం తీసుకువచ్చే ప్రయత్నాలు చేసింది. అది కూడా పెండింగ్‌లో పడింది. సెప్టెంబర్‌ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనను పార్టీ నాయకత్వం ముందుకు తెస్తున్నది. అదే సమయంలో ఎన్నికలను వాయిదా వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

కేంద్రమే ఈ విషయంతో తమ వైఖరేంటో చెప్పకుండా, బీసీలకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఈ బిల్లులకు ఆమోదం తెలిపినా తెలపకపోయినా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ల ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ బిల్లులపై రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ సబ్‌కమిటీ కూడా ఢిల్లీకి వెళ్లారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, పెండింగ్‌లో ఉన్న బిల్లులపై న్యాయపోరాటం చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకోబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడిస్తున్నారు.

పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ విషయంలో బీసీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో బీసీలకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. బలమైన స్థానాల్లో ఎంపిక చేసిన ఆధిపత్యకులాల వారికి ఇచ్చి, బీసీలకు ఓడిపోయే స్థానాలను కేటాయిస్తే తమ పరిస్థితేంటని నిలదీస్తున్నారు. పార్టీ పరంగా వారు ఇచ్చిన స్థానాల్లో ఆర్థికంగా, సామాజిక పరంగా బలమైన వ్యక్తులు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తే వారిని ఆర్థికంగా ఎదుర్కొనే శక్తి బీసీలకు లేదని అంటున్నారు. నిజంగా బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీసీలకు రిజర్వేషన్‌ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రచారం చేసుకుంది. అయితే త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయని పక్షంలో దాని ప్రభావం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో బీహార్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం న్యాయపరంగా సాధ్యం కాకపోతే పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్నికలకు వెళ్లాలంటే ముందు బీహార్‌లో జరిగే ఎన్నికలు పూర్తవ్వాలని, బీహార్ ఎన్నికలకంటే ముందే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పాతపద్ధతిలోనే నిర్వహిస్తే.. దీని ప్రభావం బీహార్ ఎన్నికల్లో పడి కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయ్యే అవకాశాలు లేకపోలేదన్న సందేహాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లలు పడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే నిధుల కొరతతో, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు లేక పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఏదైనా సమస్య ఉంటే గ్రామ కార్యదర్శికి చెప్పినా నిధులు లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని దీంతో ఎక్కడి ససమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయని స్థానిక నాయకులు అంటున్నారు.

మరోవైపు బీసీలకు సంబంధించిన వ్యవహారం ఇంత తక్కువ సమయంలో తేలేది కాదని, ఎన్నో ఏళ్లతరబడిగా నడుస్తున్న వివాదమని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హుటాహుటిన ఈ బిల్లును ప్రవేశ పెట్టినంత మాత్రాన వెంటనే రాజ్యాంగ సవరణ చేయడం అంత సులువైన పని కాదని అంటున్నారు. ఉదాహరణకు తమిళనాడులో బీసీలకు సంబంధించిన బిల్లుపై 1980లో అసెంబ్లీ తీర్మానం చేస్తే దాన్ని చట్టం చేసి అమలు చేసేందుకు పదేళ్లు పట్టిందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా బీసీల వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి