రేవంత్ తదుపరి లక్ష్యం వరంగల్..?
WARANGAL | రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో భూకంపాలు సృష్టిస్తోంది. యావత్ రాజకీయ లోకమంతా ఇప్పుడు హైడ్రా చుట్టే తిరుగుతోంది. మరోపక్క ప్రజానీకం హైడ్రాకు హారతులు పడుతున్నారు. ఇది మాకంటే మాకు కావాలని వేలకొద్దీ వినతులు జిల్లాలనుండి వస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా గ్రేటర్ వరంగల్ నుండి ఈ వినతులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి తదపరి లక్ష్యం వరంగలేనని అధికార వర్గాల భోగట్టా.

గ్రేటర్ వరంగల్(Greater Warangal) – వరంగల్, హనుమకొండ, ఖాజీపేట త్రినగరాలను కలుపుకుని ఏర్పాటు చేసిన మహానగరం. హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలోనూ స్థానం సంపాదించిన వరంగల్లో కూడా భూఅక్రమణలు, చెరువుల ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు లెక్కకుమించి జరిగాయి. కేవలం ఈ ఆక్రమణ(encroachments)ల వల్లే ఈ మధ్య వరంగల్, హనుమకొండ నగరాలు నీట(Floods) మునిగాయి. రోడ్లన్నీ నదులుగా మారాయి. అధికారులు పడవలు వేసుకుని బాధితులను కాపాడాల్సి వచ్చింది. ఇక చెరువుల విషయానికొస్తే, చిన్న, పెద్ద వడ్డేపల్లి(Waddepally lakes) చెరువులు, భద్రకాళి(Bhadrakali Tank) చెరువు, బంధం చెరువు, కోట చెరువు, ఉర్సు కుంట లాంటివెన్నో ఆక్రమణల వల్ల కుంచించుకుపోయాయి. కొన్నైతే పూర్తిగా మాయమయ్యాయి.
2018లో కుడా(KUDA) ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ(Lake Protection Committee) ఒకటి ఏర్పాటైనప్పటికీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కలుగలేదు. కుడా మాస్టర్ ప్లాన్ (KUDA Master Plan) ప్రకారం తన పరిధిలో దాదాపు 1000 వాటర్ బాడీలున్నాయి. అందులో 247 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. నగరీకరణ కారణంగా ఇందులో దాదాపు సగం మాయమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు భద్రకాళి చెరువు ఎఫ్టిఎల్‌లో 250 అక్రమ నిర్మాణాలలో దాదాపు 100 వరకు కూల్చివేసామని, ఇక బంధం చెరువులోనైతే 366 అక్రమ కట్టడాలుంటే ఏడు మాత్రమే కూల్చివేతకు గురయ్యాయని అధికారులు చెప్పారు. చిన్నవడ్డేపల్లి చెరువులో 366, కోట చెరువులో 150 ఆక్రమిత కట్టడాలున్నాయి. ఇంకా వాటి జోలికి అధికారులు వెళ్లలేకపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్న నన్నపునేని నరేందర్(Nannapuneni Narender), ఎక్కడో ఉన్న వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్(Aruri Ramesh)లు ఆక్రమణలలో అగ్రస్థానంలో ఉన్నట్లు వరంగల్ ప్రజల ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఆరూరి రమేశ్ భూదాహానికి అంతేలేదని, ఆయన నియోజకవర్గం కొంతమేర హనుమకొండ జిల్లాలోకి రావడం తమ ఖర్మగా చెప్పుకుంటున్నారు. ఇదీఅదీ అనే తేడా లేకుండా నాలాలు, ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములను చెరబట్టి, విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అంగుళం జాగా కూడా వదలడని ప్రతీతి. ఆయన రోజూవారీ కార్యక్రమాలలో సింహభాగం భూవివాదాల సెటిల్మెంట్లు, దందాలేనని గతంలో ఆయన అనుచరులుగా చెప్పుకున్నవారే కుండలు బద్దలు కొడుతున్నారు.
వరంగల్లో జరిగిన, జరుగుతున్న భూఆక్రమణల దందా అంతా రెవెన్యూ(Revenue), నీటిపారుదల(Irrigation) శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది. అక్కడి చెరువులు, కుంటల లెక్కలు తీయాలని ఇప్పటికే రేవంత్ వరంగల్ అధికారులను ఆదేశించినట్లు, వారంతా చెరువులు, కుంటల ఎఫ్టిఎల్(FTL), బఫర్ జోన్ల (Buffer Zones) వివరాలు, ఉపగ్రహ చిత్రాలను సిద్ధం చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్(GWMC) అధికారి ఒకరు తెలిపారు. హైడ్రా తరహాలోనే వాడ్రా(WADRAA – Warangal Disaster Response and Asset Monitoring and Protection Agency)ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. దాంతో అప్రమత్తమైన కబ్జాదారులు, అక్రమ కట్టడాల నిర్మాణదారులు కూడా ఇవే ఎంక్వైరీలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. వాడ్రాకు కూడా సమర్థుడైన ఐపిఎస్ అధికారిని కమిషనర్గా నియమించి, ప్రభుత్వ, ప్రైవేట్ భూములూ, చెరువులను కాపాడాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపుతున్నారు.