భూభారతి, 22ఏలో అక్రమాలు, ఫీనిక్స్, రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపుల అక్రమాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బహిరంగ చర్చకు సవాల్ విసిరిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్లుగా గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. తన సవాల్‌ను స్వీకరించి మంత్రి పొంగులేటి చర్చకు రావాలని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
చెప్పిన సమయం దాటిపోయాక ఏలేటి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొంగులేటి అక్రమాలపై అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి..అన్ని సాక్ష్యాధారాలను ఈడీ, సీబీఐకి అప్పగిస్తానని ఏలేటి తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై ఆధారాలతో రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తానని స్పష్టం చేశారు.
