Manuguru BRS Office Attack| మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి..ఫర్నిచర్ దగ్ధం

మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలకు దాడికి పాల్పడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ శ్రేణులు ఫర్నిచర్ ను దగ్దం చేశారు.

Manuguru BRS Office Attack| మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి..ఫర్నిచర్ దగ్ధం

విధాత : మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(Manuguru BRS office)పై కాంగ్రెస్ కార్యకర్తలకు దాడి(Congrss Attack)కి పాల్పడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ శ్రేణులు ఫర్నిచర్ ను దగ్దం చేశారు. ఫ్లెక్సీలు చించి వేశారు. ప్రభుత్వ స్థలంలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిని అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది. అటు తమ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు అక్కడే మోహరించి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.

కేటీఆర్ ఆగ్రహం

మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. సంఘటన సమాచారం తెలుసుకుని జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు తో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అన్నారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్తానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర రాజధాని నుంచి మొదలుకుని గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.