ఆపిల్ పండ్ల డీసీఎం బోల్తా..ఎగబడిన జనం

మహబూబాబాద్ జిల్లాలో ఆపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడడంతో స్థానికులు, ప్రయాణికులు పోటీ పడి ఆపిల్ పండ్లను తీసుకెళ్లారు. ఈ ఘటన వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కలకలం రేపింది.

పెట్రోల్ ట్యాంకర్లు, కూల్ డ్రింక్స్, మద్యం, వంట నూనె, టమాటాల లారీలు రోడ్డు ప్రమాదాలలో బోల్తా పడినప్పుడు వాటి కోసం జనం ఎగబడటం చూశాం. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ సారి బోల్తా కొట్టింది మాద్రం ఓ ఆపిల్ పండ్ల లోడ్ డీసీఎం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామం స్టేజ్ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై..ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది.

ఇంకేముంది అది చూసిన స్థానికులు, దారిన పోయే ప్రయాణికులు పోలోమంటూ పరుగెత్తికెళ్లి పోటీలు పడి మరి డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. లుంగీలు, ఆటోలు, సంచులతో క్షణాల్లో ఆపిల్ పండ్ల లోడ్ మొత్తం ఖాళీ చేసేసి..జనం పండ్ల మూటలతో సంబరంగా ఇంటి బాట పట్టారు. ఆపిల్ లోడ్ యాజమాని మాత్రం అసలే డీసీఎం బోల్తా పడిందన్న బాధలో ఉంటే..అందులోని సరుకునంతా జనం లూటీ చేయడంతో ఇదేం ఖర్మరా బాబు అనుకుంటూ డీసీఎంను లేవనెత్తే పనిలో పడ్డారు.

Latest News