Telangana Assembly | అసెంబ్లీలో అక్కా తమ్ముడి వాగ్వాదం.. సబిత, రేవంత్‌రెడ్డి మాటల యుద్ధం

అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీలో తీవ్ర కలకలం రేపాయి. బడ్జెట్‌పై పద్దుల చర్చలో భాగంగా బీఆరెస్‌ సభ్యుడు కేటీఆర్‌ లేవనెత్తిన అంశాలపై స్పందించిన రేవంత్‌రెడ్డి..

Telangana Assembly | అసెంబ్లీలో అక్కా తమ్ముడి వాగ్వాదం.. సబిత, రేవంత్‌రెడ్డి మాటల యుద్ధం

ఇక్కడ ఉండమని చెప్పి.. అక్కడ తేలారు
నన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నావు?
సీఎంను గద్గద స్వరంతో నిలదీసిన సబిత

విధాత, హైదరాబాద్: అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీలో తీవ్ర కలకలం రేపాయి. బడ్జెట్‌పై పద్దుల చర్చలో భాగంగా బీఆరెస్‌ సభ్యుడు కేటీఆర్‌ లేవనెత్తిన అంశాలపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. ఇక్కడ ఉండమని చెప్పిన అక్కలు అక్కడ తేలారు అని వ్యాఖ్యానించారు. ఇవి తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనంటూ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏ పార్టీలోనుంచి ఏ పార్టీలోకి వెళ్లారని సబిత ప్రశ్నించారు. పార్టీల మార్పుపై తప్పకుండా చర్చ పెట్టాలన్నారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చివేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు బీఆరెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని నిలదీశారు. వెనుకనున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తారని రేవంత్‌రెడ్డి చెప్పడం అభ్యంతరకమని, తాము ఏం మోసం చేశామని ప్రశ్నించారు. ఆ రోజు ఆయనను మంచి భవిష్యత్తు ఉంటదని, పార్టీకి ఆశాకిరణమవుతావని చెప్పి ఆహ్వానించినా లేదా? అని గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు.

‘ఎవరిని అవమానిస్తున్నావో ఆలోచించాలి. ఎందుకు నాపై కక్ష? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? మేం ఆడబిడ్డలం. ఏం మోసం చేశామని మాపై దాడి చేస్తున్నారు? ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..’ అంటూ సబిత గద్గద స్వరంతో డిమాండ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి బదులిస్తూ తనను మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిన రోజున తాను సబితా ఇంద్రారెడ్డిని కలిసి అక్క ఆశీర్వదం కోరానని చెప్పారు. పార్టీలోకి రావాలని, తామంతా అండగా ఉండి గెలిపిస్తామని చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను ఎన్నికల బరిలోకి దిగగానే కేసీఆర్ మాయమాటలతో ఏమో గాని తనను మోసం చేసిన సబిత బీఆరెస్‌లో చేరిపోయి, మంత్రి పదవి సంపాదించుకున్నరని చెప్పారు. ఈ రోజు మాకు నీతులు చెబితే మేమన్నా అమాయకులమా అంటూ దుయ్యబట్టారు. అందుకే నన్ను (తమ్ముడిని) మోసం చేసిన సబితక్క తో జాగ్రత్తగా ఉండాలని చెప్పానని అన్నారు. అన్నింటికీ సమాధానం చెబుతానని, నూతన గవర్నర్‌కు ఆహ్వానం తెలిపే కార్యక్రమం అనంతరం సభకు తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోయారు.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో బాధ కల్గితే ఆనాడు దళితుడైనన తనను సీఎల్పీ నాయకుడిగా చేసినప్పుడు సబిత పార్టీ మారడంతో చేసింది మోసం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీలో ఉన్న సబితను పార్టీలో చేర్చుకుని మంత్రిని చేసి, కొడుకుకు ఎంపీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తే తాను సీఎల్పీ నేతగా నియమితుడికాగానే పార్టీని మోసం చేసి బీఆరెస్‌లో చేరిపోయారని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రేవంత్ రెడ్డిని అంటున్నావంటూ మండిపడ్డారు. దీంతో బీఆరెస్ సభ్యులు వాగ్వివాదానికి దిగగా, సభను స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పది నిమిషాలు వాయిదా వేశారు. మధ్యలో సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్‌లోకి వస్తామని ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్యేలు చెబితే వారి కోసం రాహుల్ గాంధీ వద్ద టైమ్ తీసుకున్నారని, తీరా వారు వెనక్కిపోయారన్న బాధతో రేవంత్‌రెడ్డి అక్కలు మోసం చేశారని వ్యాఖ్యానించారన్నారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సబితతోనే ఫిర్యాదు చేయించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో పదేళ్లు మంత్రిగా పదవులు అనుభవించి, ఈ రోజు కాంగ్రెస్‌ను తిడుతుంటే వారు చప్పట్లు కొడుతున్నారన్నారు. మీలాగా చప్పట్లు కొట్టే సంస్కృతి మాకు లేదన్నారు. సబితపై చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో శ్రీధర్‌బాబు, స్పీకర్ ప్రసాద్‌లు స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అక్కలని మాట్లాడారని, ఎవరి పేరు ప్రస్తావించలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.