Site icon vidhaatha

తెలంగాణ పై బాబు, రేవంత్ ల కుట్రలు

విధాత : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పదేళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి మళ్లీ కుట్రలు మొదలుపెట్టారని బీఅరెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
రిటైర్డు ఐఏఎస్‌ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ను తెలంగాణ నీటిపారుదల, జల వనరుల శాఖ సలహాదారుగా నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామకం వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో చెప్పాలని, వెంటనే పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. విభజన సమయంలో ఏపీలో కలిపిన ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకూ ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. భద్రాచలం రూరల్ మండలం యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు పంచాయతీలను రాష్ట్రంలో కలిపేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎవరు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకోమంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశిస్తూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన జీవితంలో ఒక్కసారి జై తెలంగాణ అనలేదన్నారు.

Exit mobile version