బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్ : అమ్మాయి పేరు మీద రెండు బర్త్ సర్టిఫికెట్లు
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాధిత యువతికి సంబంధించి రెండు వేర్వేరు బర్త్ సర్టిఫికెట్లు బయటపడటంతో అసలు వయస్సుపై వివాదం నెలకొంది. స్కూల్ రికార్డులు, 2021 చార్జ్‌షీట్, ఇతర ప్రభుత్వ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
బండి సంజయ్‌తో భగీరథ్.. కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి
Bandi Bageerath Case Takes Twist As Girl’s Age Comes Under Scanner
విధాత క్రైం బ్యూరో | మే 13, 2026 | హైదరాబాద్:
Bandi Bageerath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో ఫిర్యాదు చేసిన యువతి వయస్సుకు సంబంధించిన పత్రాల్లో తీవ్ర వైరుధ్యం బయటపడటంతో దర్యాప్తు మొత్తం అదే అంశంపై కేంద్రీకృతమైంది. యువతికి సంబంధించి రెండు వేర్వేరు బర్త్ సర్టిఫికెట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
ఒక బర్త్ సర్టిఫికెట్‌ను జీహెచ్‌ఎంసీ జారీ చేసినట్లు తెలుస్తుండగా, అందులో యువతి పుట్టిన తేదీ 2008 ఆగస్టు 12గా నమోదైఉందని సమాచారం. మరోవైపు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జారీ చేసిన మరో సర్టిఫికెట్‌లో పుట్టినరోజు 2010 ఆగస్టు 12గా నమోదు చేసినట్లు తెలిసింది. ఈ రెండు పత్రాల మధ్య దాదాపు రెండేళ్ల తేడా ఉండటంతో కేసులో అసలు బాధితురాలి వయసే ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది.
కాగా, పోక్సో కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా బండి భగీరథ్ సిట్ ఎదుట గైర్హాజరయ్యారు. తదుపరి చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
స్కూల్ రికార్డుల్లోనూ తేడాగా ఉన్న వివరాలు
దర్యాప్తు అధికారులు ఇప్పుడు యువతికి సంబంధించిన పాఠశాల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. స్కూల్ ప్రవేశ పత్రాలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, ఇతర విద్యాసంబంధ పత్రాల్లో కూడా వేర్వేరు పుట్టిన తేదీలు నమోదు అయినట్లు సమాచారం. అంతేకాదు, కొన్ని రికార్డుల్లో పేర్లలో కూడా తేడాలున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏ పత్రం అసలైనది? ఏది తర్వాత మార్పులు జరిగిందనే అంశాలపై అధికారులు పలు ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అధికారిక రికార్డుల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2021 అండర్ ఏజ్ డ్రైవింగ్ కేసు కూడా పరిశీలనలోకి

పోక్సో కేసులో బాధితురాలి వయస్సు వివాదం – ఆరోపణలెదుర్కుంటున్న బండి భగీరథ్
ఈ వ్యవహారంలో 2021లో నమోదైన ఓ అండర్ ఏజ్ డ్రైవింగ్ కేసు చార్జ్‌షీట్ కూడా ఇప్పుడు దర్యాప్తులో భాగమైంది. ఆ చార్జ్‌షీట్‌లో యువతి వయస్సు అప్పటికి 15 సంవత్సరాలుగా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ రికార్డు కూడా ప్రస్తుత పోక్సో కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
దర్యాప్తు అధికారులు ప్రస్తుతం పాత కేసు పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, విద్యాసంస్థల వివరాలు అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తూ అసలు జనన తేదీని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.
రేషన్ కార్డుపై కూడా చర్చ
ఇక ఈ కేసులో మరో అంశం కూడా చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాల్లో బాధిత కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న సమయంలో, వారికి రేషన్ కార్డు కూడా ఉన్నట్లు బయటపడిందని సమాచారం. సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు జారీ చేసే రేషన్ కార్డు, భారీ ఆస్తుల ఆరోపణల నేపథ్యానికి విరుద్ధంగా కనిపిస్తోందని చర్చ సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram