గంగుల.. నీలెక్క గుట్టలు మాయం చేశానా?

నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుండి నన్ను తీసేశారట నేనేమైనా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నానా? గంగుల లెక్క గుట్టలు మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు దొబ్బానా? నేనెట్లా అవినీతి చేస్తా? అని కరీంనగర్ శాసనసభ బి.జె.పి. అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

గంగుల.. నీలెక్క గుట్టలు మాయం చేశానా?

భూకబ్జాలు చేశానా? పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా?

తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి నువ్వే

గంగుల కమలాకర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుండి నన్ను తీసేశారట నేనేమైనా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నానా? గంగుల లెక్క గుట్టలు మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు దొబ్బానా? నేనెట్లా అవినీతి చేస్తా? అని కరీంనగర్ శాసనసభ బి.జె.పి. అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శికి తేడా తెలియని మూర్ఖుడు గంగుల అని ధ్వజమెత్తారు. నా పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయాలని పంపుతోంది.. అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరు.. హెలికాప్టర్ ఇవ్వరు.. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వరు.. మోదీ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తడని తెల్వదా? అని నిలదీశారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడు గంగుల కమలాకరేనని అన్నారు. అవినీతిపరంగా తెలంగాణలో కరీంనగర్ టాప్ అని రాష్ట్ర ప్రభుత్వ నిఘా నివేదికలే చెబుతున్నాయన్నారు. అవినీతికి పాల్పడుతున్నందుకే గంగులను కరీంనగర్ నియోజగవర్గానికే పరిమితం చేశారు.. చివరి క్షణం వరకు బి.ఫాం ఇవ్వకుండా సతాయించారని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ మండలంలోని చామన్ పల్లి గ్రామంలో శుక్రవారం బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే.. తెలంగాణ మొత్తం తిరిగి పేదల కోసం కొట్లాడిన.. జైలుకు పోయిన.. అందుకు కేసీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేస్తే, గత పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రజలను కట్టివ్వలేదు.. ఆ ఇండ్లు కట్టిస్తే తెలంగాణకు మరో 5 లక్షల ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదని సంజయ్ అన్నారు. తీగలగుట్టపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా 10 ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆర్వోబీ కట్టాలని అడిగినా మంత్రిగా గంగుల ఏనాడు పట్టించుకోలేదన్నారు. దీంతో తానే స్వయంగా కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావడం వల్ల ఆర్వోబీ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. పంట నష్టపోతే ఈ ఊరికి వచ్చి అండగా నిలిచా.. వడ్ల కొనుగోలు సమయంలో ఇక్కడికి వచ్చి మీ తరుపున కొట్లాడా.. మరి గంగుల ఈ ఊిరికి ఏం చేశారు.. రేషన్ మంత్రి ఆయనే కదా ఒక్క సంతకం చేస్తే పేదొళ్లందరికీ కొత్త రేషన్ కార్డులు వచ్చేవి కదా.. అని అన్నారు. కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ నిధులు నేనే తీసుకువచ్చా.. కరీంనగర్-వరంగల్, కరీంనగర్-జగిత్యాల మార్గంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారి నిర్మాణ పనులకు నిధులు నేను మంజూరు చేయించా.. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించా.. అన్నారు. కానీ వాటన్నింటికీ గంగుల కొబ్బరికాయలు కొట్టారు.. నాకో అనుమానం.. గంగుల ఏమైనా కొబ్బరికాయల దుకాణం పట్టారా..? దమ్ముంటే ఈ పనులకు సంబంధించి లెక్కలతో సహా చెప్పేందుకు నేను సిద్ధం? ఆయనకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మొన్ననే 24 ఏళ్ల అమ్మాయి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటున్నరు.. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక, కోచింగ్ లకు డబ్బుల్లేక, తిండిలేక గోస పడి ఆత్మహత్య చేసుకుంటున్నరు.. వాళ్ల కోసం నేను కొట్లాడుతుంటే 10వ తరగతి హిందీ పేపర్ లీక్ చేశానని నాపై దొంగ కేసులు పెట్టి అర్ధరాత్రి నన్ను ఇంటి నుండి గుంజుకుపోయి జైలుకు పంపిన దుర్మార్గుడు గంగుల కమలాకర్ అని ధ్వజమెత్తారు. ఉద్యోగుల పక్షాన పోరాడితే తన కార్యాలయాన్ని ధ్వంసం చేసి తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని తెలిపారు.

గంగుల ఓటమి ఖాయం..

ఈ ఎన్నికల్లో గంగుల ఓడిపోవడం ఖాయమని, మూడోస్థానానికి పడిపోతున్నాననే భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడని తెలిపారు. ఓటమి భయంతో యువతకు లక్ష సెల్ ఫోన్లు పంపిణీ చేయాలని, ఓటుకు 10 వేల రూపాయలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నానని చెప్పారు. ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిందెవరు? కుటుంబం కోసం వందల కోట్లు దిగమింగిందెవరో ప్రజలే ఆలోచించాలన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, వారే తగిన తీర్పు ఇవ్వాలని కోరారు.