విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: తెలంగాణలో మోడీ, అమిత్ షా నేతృత్వంలో రామరాజ్యం నెలకొల్పుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజాగర్జన సభ మాట్లాడారు. హిందూత్వానికి చిరునామా, ధర్మానికి అడ్డా ఆదిలాబాద్ గడ్డ అని అన్నారు. గిరిజనుల ఆశాజ్యోతి కొమురం భీం వారసులారా.. నిజాం మెడలు వంచిన రాంజీ గోండుల గడ్డ అంటూ కీర్తించారు. కేసీఆర్ నాకు గురువని, ఆయనతోనే భాష నేర్చుకున్నానని, ఆయన బాగుండాలని అన్నారు. అయితే కొన్ని రోజుల నుండి కేసీఆర్ కనబడలేదని, ఆయన కొడుకు ఏం చేస్తున్నాడో అని ఆందోళనగా ఉందని చెప్పారు.
కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పోడు భూములు ఇస్తానని ఇచ్చాడా? ఉద్యోగులకు ఒకటో తారీకు నాడు జీతాలు ఇస్తున్నాడా? ప్రమోషన్ ఇస్తున్నాడా? రైతులకు రుణమాఫీ చేశాడా? మహిళలకు రక్షణ కల్పించాడా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ తో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు ఆగమైనవని పేర్కొన్నారు. ఏమి చేయని పార్టీకి ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేసారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక గెలిచినప్పటికీ, పరిపాలనలో అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీరాలంటే, తెలంగాణ బాగుపడాలంటే మోడీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భైంసాలో హిందూ సమాజంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే మోడీకే అధికారం ఇవ్వాలని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలేవి : ఈటల
బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో చదువుకున్న వారికి ఉద్యోగం రాదని, లక్షలు పోసి కోచింగ్ సెంటర్లలో చదువుకొని పరీక్ష రాసిన వారికి పేపర్లు లీక్ తో గుండె గుభేలైందన్నారు. అక్రమ మార్గాన, డబ్బులు ఇచ్చిన వారికి పైరవీదారులకు ఉద్యోగాలు వస్తాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆడబిడ్డలు లక్షాధికారులు అవుతారని అనుకుంటే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునేది ఆదిలాబాద్ జిల్లాలోనే అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగ యువత ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసుకుంటే, వాటి ఫలితాలు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, కష్టాలే మిగిలాయని పేర్కొన్నారు. రైతులు హరిగోసపడుతున్నారని, ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వని తెలంగాణ సర్కార్, పక్క రాష్ట్రాలలో రైతులకు తెలంగాణ డబ్బు పంపిణీ చేస్తున్నాడని విమర్శించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో 20 రోజుల నుంచి కరెంట్ లేదని, కేసీఆర్ మాత్రం 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కరెంటు కోసం ధర్నా చేస్తే రైతులను జైల్లోకి పంపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు.