ఐఎన్ సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్

ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని, అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటోషోడు స్థాపించారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్

  • Publish Date - April 26, 2024 / 09:16 PM IST

*బీజేపీ అంటే భారతీయ ఆత్మ

*కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్లో 55 శాతం గుంజుకోవడం ఖాయం

*కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదు.. రాష్ట్రానికి పట్టిన శని..

*అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లను బుద్ది చెప్పండి.

*మానకొండూరు ‘దళిత సమ్మేళనం’లో బండి సంజయ్

విధాత బ్యూరో, కరీంనగర్: ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని, అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటోషోడు స్థాపించారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్. శుక్రవారం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానకొండూరులో నిర్వహించిన ‘దళిత సమ్మేళనం’లో ఆయ‌న హాట్ కామెంట్స్ చేశారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘బ్రిటీష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నార‌ని తెలిపారు. పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ తమదని, కాంగ్రెస్ లో భారతీయత ఎక్కడుంది?’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఏలుతున్న గాంధీ కుటుంబం డూప్ అని… మహాత్మాగాంధీ అసలు సిసలైన గాంధీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే.. పేదలు సహా ఎవరు చనిపోయినా… వారి ఆస్తిలో 55 శాతం కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తోందని హెచ్చరించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఇంఛార్జీ శ్యాం పిట్రోడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. దేశానికి, ధర్మానికి ప్రధాని మోదీ రక్ష అని చెప్పిన బండి సంజయ్.. ఈ దేశంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయంటే, దేశం సురక్షితంగా ఉందంటే అది ఆయన చలువేనని తెలిపారు.

57 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడూ దళితుల అభ్యున్నతి కోసం పనిచేయలేదని, అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిదని చెప్పారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కేసీఆర్ వారిని మోసం చేశారని తెలిపారు. మాట ఇస్తే తల నరుక్కుంటానే తప్ప మాట తప్పనన్న కేసీఆర్ ఎన్నడైనా మాట మీద నిలబడ్డారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఓట్లు దండుకుని చివరకు అభివృద్ధి పేరుతో దళితుల భూమినే గుంజుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు కూడా హాజరుకాని అహంకారి కేసీఆర్ అని, ఈ విషయంలో దళిత సంఘాలు ఆయనను నిలదీయకపోవడం బాధాకరమన్నారు .అంబేద్కర్ రాజ్యాంగాన్ని బీజేపీ తప్పకుండా అమలు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తామని ఎవరు ఆరోపణ చేసినా సహించేది లేదన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ఆత్మ కాదు.. ఆయన ఈ రాష్ట్రానికి పట్టిన శని…అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.. అయినా వాళ్లకు సిగ్గు రాలేదన్నారు. ఎవరికి ఓటేస్తే ఓటుకు విలువ ఉంటుందో వారికే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర నాయకులు సురేష్, శ్రీనివాస్, సొల్లు అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Latest News