Bathukamma | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.. నేడు ఎంగిలిపూలతో సంబరాలు షురూ..!

Bathukamma | బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రత్యీక. ప్రకృతితో మమేకమైన పండుగను జరుపుకునేందుకు యావత్‌ రాష్ట్రం ముస్తాబైనది. తొమ్మిది రోజుల వేడుకలను అట్టహాసంగా జరుగనున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా మహిళలంతా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని పాటలు పాడుతూ ఆటలాడనున్నారు

Bathukamma | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.. నేడు ఎంగిలిపూలతో సంబరాలు షురూ..!

Bathukamma | బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రత్యీక. ప్రకృతితో మమేకమైన పండుగను జరుపుకునేందుకు యావత్‌ రాష్ట్రం ముస్తాబైనది. తొమ్మిది రోజుల వేడుకలను అట్టహాసంగా జరుగనున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా మహిళలంతా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని పాటలు పాడుతూ ఆటలాడనున్నారు. రంగు రంగులతో అందంగా బతుకమ్మలతో గ్రామాలన్నీ పూలవనాలుగా మారనున్నాయి. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలు బుధవారం ఎంగిలి బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆడపడుచులు రెడీ అయ్యారు. పెళ్లయిన మహిళలు పుట్టింటికి చేరుకొని బతుకమ్మ పేర్చనున్నారు. రోజుకో బతుకమ్మను పేరుస్తూ.. తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. తొలి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. పండుగ ‘పెత్రమాస’ (పితృఅమావాస్య) రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుంది. ఎంగిలిపూల బతుకమ్మను అలా పిలవడానికి ఓ కారణం ఉంది. సాధారణంగా చాలామంది చేతులతో కొందరు కత్తెరతో తెంచుతుంటారు. మరికొందరు నోటితో తుంచి బతుకమ్మలను పేరుస్తారు. అందుకే తొలిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రత్యేకంగా తెలంగాణ అనంతరం అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇక రెండో రోజు పేర్చే బతుకమ్మను అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు బతుకమ్మను బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మలను పేరుస్తారు.

ఆశ్వయుజ మాసం వచ్చిందంటేనే..

ఆశ్వయుజ మాసం వచ్చిందంటే.. బతుకమ్మ పండుగ మొదలైనట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు వేడుకలను జరుపుకుంటారు. బతుకమ్మ తెలంగాణలో ప్రధాన పండుగ. దసరాకు ముందు దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే, బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ప్రధానమైన కథ ఒకటి ఉన్నది. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘బతుకమ్మా’ అంటూ దీవించారని.. అప్పటి నుంచే ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా మహిళలంతా తమకు ఎలాంటి ఆపదలు రావొద్దని, భర్త, పిల్లాపాపలు కాపాడాలని గౌరమ్మను వేడుకుంటారు. మరో కథ సైతం ప్రచారంలో ఉంది. దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆమెకు కూతురు జన్మించింది. ఆమెకు లక్ష్మి అనే పేరుపెట్టారు. చిన్ననాటి నుంచి లక్ష్మి అనేక గండాలను ఎదుర్కొంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆమెకు ‘బతుకమ్మ’ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మ పూజించడం ఆనవాయితీగా మారిందంటారు.

బతుకమ్మకు ఎంతో ప్రాధాన్యం

సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో బతుకమ్మ పండుగ వస్తుంది. ఈ పండుగ సమయంలో యావత్‌ తెలంగాణ అంతా కోలాహలంగా మారుతుంది. పండుగలన్నింటిలో బతుకమ్మకు విశేష స్థానం ఉన్నది. మిగతా పండుగల తరహాలో కాకుండా పూలనే కొలవడం ప్రత్యేకత. బతుకమ్మ మహిళల సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగుస్తూ, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా మారిపోతుంది. ప్రకృతి ఆకుపచ్చ చీర ధరించినట్లుగా ఉంటుంది. తటాకాలన్నీ నీటితో నిండి ఉంటాయి. పూలు విరబూసి ఆకర్షిస్తుంటాయి. బతుకమ్మ పండుగలో గునుగు, తంగేడు పూలను ఎక్కువగా వినియోగిస్తారు. బతుకమ్మ వారం ముందు నుంచే సందడి మొదలవుతుంది. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే ఆడపడుచులంతా బతుకమ్మలు అందంగా అంలకరించి.. ప్రతిరోజూ సాయంత్రం కూడళ్లలోకి చేర్చి ఉయ్యాల పాటలు పాడుతారు. సద్దుల రోజున బతుకమ్మ సంబరాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.