బీసీ డిక్లరేషన్ సభతో కేంద్రం దిగిరావాలి: మంత్రి పొన్నం
15 వ తేదీన కామారెడ్డి వేదికగా లక్ష మందితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు

హైదరాబాద్, సెప్టెంబర్7(విధాత): 15 వ తేదీన కామారెడ్డి వేదికగా లక్ష మందితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కామారెడ్డిలో ఈనెల 15వ తేదీన జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం ఆదివారం కామారెడ్డిలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మోకాలడ్డుతున్న కేంద్రానికి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చేలా సభ ఉండబోతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సభ నిర్వహిస్తున్నామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్త శుద్ధిని శంకించే ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా సభ ఉండబోతోందన్నారు.
సభకు బీసీలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని, సభ సక్సెస్‌తో కేంద్రం దిగి రావాలన్నారు. బీసీలమంతా ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,ఎంపీ సురేష్ షెట్కర్,ఎమ్మెల్యేలు , డీసీసీ అధ్యక్షులు ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.