Eatala Rajendar : స్థానిక ఎన్నికల కోసం ఖర్చులు పెట్టకోకండి
స్థానిక ఎన్నికల ఖర్చులు పెట్టకండి అని హెచ్చరించిన ఈటల రాజేందర్.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణతో ఎన్నికలు అనిశ్చితిలోనని వ్యాఖ్యలు.
విధాత : తెలంగాణ ప్రభుత్వం ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేయగా..మరోవైపు ఆక్టోబర్ 8న బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక విచారణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల కోసమని ఆశావహులు తొందరపడి డబ్బులు ఖర్చుపెట్టుకోకండని ఈటల హెచ్చరించారు. అసలే దసరా పండుగ కూడా రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దావత్ ల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారని తెలిపారు. అసలు ఎన్నికలు జరుగతాయో లేదోనన్న సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండని హితవు పలికారు.
మహారాష్ట్ర తరహాలో ఎన్నికలను రద్దు చేసే ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలనుకున్న స్థానిక ఎన్నికలు న్యాయపరంగా చెల్లుబాటు కాని పరిస్థితిలో ఉన్నాయని..కోర్టులు ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా లేవని రద్దు చేస్తే పరిస్థితి ఏంటి ? అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అభ్యర్థులు పెట్టుకున్న ఖర్చులు..ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పెట్టిన ప్రజాధనం వ్యయం అంతా కూడా వృథానే కదా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిందని గుర్తు చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం గందరగోళంగా తయారైందని ఈటల మండిపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram