Payal Shankar | బీఆరెస్‌, కాంగ్రెస్ బడ్జెట్‌లకు తేడా లేదు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

బీఆరెస్‌, కాంగ్రెస్ బడ్జెట్‌లకు ఎటువంటి తేడా లేదని.. రెండు ప్రభుత్వాలు విలువైన భూములను అమ్మేందుకు సిద్ధం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు

Payal Shankar | బీఆరెస్‌, కాంగ్రెస్ బడ్జెట్‌లకు తేడా లేదు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

బీసీలకు అన్యాయం చేశారు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌, కాంగ్రెస్ బడ్జెట్‌లకు ఎటువంటి తేడా లేదని.. రెండు ప్రభుత్వాలు విలువైన భూములను అమ్మేందుకు సిద్ధం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. శనివారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో బీజేపీ నుంచి శంకర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 14 వేల కోట్లను అదనంగా సమకూరుస్తామని బడ్జెట్ లో పద్దు పెట్టారని అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన 31 వేల కోట్లకు 26వేలకోట్లు కేటాయించిందని, మిగిలిన రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆరెస్ చేసిన పొరపాట్లను కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు.

రాష్ట్రానికి అధికారికంగా రావాల్సి అన్ని నిధులను కేంద్రం అందిస్తుందని.. అనవసరంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని రావాల్సిన నిధులు రాకుండా చేసుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవని కానీ పదేళ్లుగా ఆ కార్పొరేషన్లలో ఫండ్స్ లేవని అన్నారు. గత బీఆరెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్‌, బీఆరెస్ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పిందని, కార్పోరేషనలు ఉన్నా నిధులు లేకపోతే ఏంలాభమని నిలదీశారు. 80శాతం ఉన్న హిందువుల దేవాలయాలకు 12కోట్లు ఇచ్చారన్నారు.

బ్రాహ్మణ పరిషత్‌కు గత ప్రభుత్వం 100కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం 50కోట్లు కోత పెట్టిందన్నారు. సీజీఎఫ్ ఫండ్ కేటాయించడం లేదన్నారు. గతంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మౌలిక సదుపాయలు, వైద్యులను, సిబ్బందిని మాత్రం కొత్తగా నియమించలేదన్నారు. తెలంగాణలో తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వ హాయంలో చెల్లించాల్సిన బిల్లులను సర్పంచ్‌లకు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అమలు చేస్తామని చెప్పిందని.. జూలై ముగుస్తున్న ఇంకా అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.