తిరుమల అక్రమాలపై విచారణ జరుపాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని, శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ కోరారు

తిరుమల అక్రమాలపై విచారణ జరుపాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్‌
విభజన సమస్యలపై సీఎంల భేటీ మంచిదే
తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ కోలుకుంది

విధాత, హైదరాబాద్ : తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని, శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలీ అంటుకుందని, భక్తులకు సౌకర్యాలు మృగ్యమయ్యాయి, అన్యమతాల ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లిందన్నారు. గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి అరోపణలు వచ్చాయని, అర్హతలను మేరకు కాకుండా సొంత మనుషులతో టీటీడీని నింపారని, ఇందులో అన్య మతస్థులు కూడా ఉండడం దారుణమని తెలిపారు.

టీటీడీని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలలని, అర్హతలను అనుసరించి హిందువులతో టీటీడీ నియామకాలు చేపట్టాలని కోరుతూ ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10,000 విరాళం ఇస్తే సామాన్య భక్తులకు కూడా వీఐపీ దర్శనం కల్పించేవారని, ఇలాభక్తుల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది?. ఇది పక్కదారి పట్టిందా.. లేక సక్రమంగా వినియోగం జరిగింది విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నవాళ్లు తమకు కావాల్సిన వాళ్లకు టీటీడీ కాంట్రాక్టులు కట్టబెట్టారని, కొనుగోళ్లలో కమిషన్లు నొక్కేశారని, ముఖ్యంగా అన్నదానానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయన్నారు.

ఇందుకు ప్రతిఫలంగా టీటీడీ పెద్దలకు భారీగానే చెల్లించుకున్నారని ఆరోపణలు వినిపించాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పక్కదారి పట్టిన సొమ్మును తిరిగి వసూలు చేయాలి.’ అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని, పక్కదారి పట్టినట్టు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో భక్తిని వ్యాపారమయంగా మారుస్తూ వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు గణనీయంగా పెంచారని, వ్యాపార కోణంలో కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని దర్శనం టికెట్ల ధరలు నిర్ణయించాలని కోరారు. ఉచిత దర్శనానికి పరిమితి విధిస్తున్నారని, ఆ రోజు పరిమితి దాటి భక్తులు వస్తే, వారిని అక్కడే నిలిపివేస్తున్నారని, ఉచిత దర్శనంపై పరిమితి ఎత్తి వేయాలని, అందరినీ దర్శనానికి అనుమతించాలని, ఉచిత దర్శన వ్యవస్థను మెరుగుపర్చాలని లక్ష్మణ్ కోరారు.

తప్పుడు ప్రచారంతో కోలుకున్న కాంగ్రెస్‌

లోక్‌సభ ఎన్నికల్లో రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తామని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి కొన్ని సీట్లు పెంచుకోగల్గిందని లక్ష్మణ్ విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ప్రజలకు మోదీ రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరానికి భేటీ కావడం మంచిదేనన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు.