బోనమెత్తిన హైదరాబాద్ … గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం
హైదరాబాద్‌లో అషాడ మాసం బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయంగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో తొలి బోనం సమర్పించారు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లో అషాడ మాసం బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయంగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కోటపైకి తీసుకెళ్లారు. లంగర్ హౌజ్‌లో తెలంగాణ ప్రభుత్వం తరుపునా తెలంగాణ బోనాల దశాబ్ధి ఉత్సవాలను స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు ప్రారంభించి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు సైతం హాజరయ్యారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పోతరాజుల, శివసత్తుల పూనకాలతో గోల్కొండ కోట మార్మోగింది. బోనాల నిర్వహణ ఖర్చు కోసం ప్రభుత్వం తరఫున రూ. 11లక్షల చెక్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, గోల్కొండ ఈవో శ్రీనివాస రాజు ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆదివారం నుంచి బోనాల పండుగ జాతరలు వరుసగా జంటనగరాల్లోని వివిధ అమ్మవార్ల ఆలయంలో కొనసాగనున్నాయి. జంటనగరాల్లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 4వరకు కొనసాగుతాయి. జగదాంబ మహంకాళీ ఆలయంలో కుంభహారతితో ముగిస్తాయి. జూలై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీకి, 21న లాల్ ధర్వజా శ్రీ సింహవాహిణి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.