BRS | లోక్‌సభలో బీఆరెస్ అడ్రస్ గల్లంతు.. ఒక్కచోట కూడా గెలవని ఆ పార్టీ అభ్యర్ధులు
లోక్ సభలో బీఆరెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆ పార్టీ తాజా పార్లమెంటు ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది

పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బ మీద దెబ్బ
రెండు చోట్ల రెండవ స్థానానికి పరిమితం
మెజార్టీ చోట్ల మూడవ స్థానం కైవసం
కంటోన్మెంటు ఉప ఎన్నికలోనూ ఓటమి
విధాత ప్రత్యేక ప్రతినిధి: లోక్ సభలో బీఆరెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆ పార్టీ తాజా పార్లమెంటు ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి నుంచి కోలుకుని లోకసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఆపార్టీ శ్రేణులను ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. రాష్ట్రంలోని 17 స్థానాల్లో కేవలం రెండు స్థానాల్లో నామమాత్రపు పోటీ నివ్వగా, మిగిలిన స్థానాల్లో మూడవ స్థానానికి పరిమితమైంది. బీఆరెస్ ను కాదని బీజేపీ పోటీలోకి రాగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆరెస్ పార్లమెంటు ఎన్నికల్లో కనీస ప్రభావాన్ని కనబరచకపోవడం ఆ పార్టీకి ఆత్మహత్యసదృశ్యంగా మారుతోందంటున్నారు.
లోక్ సభలో బీఆరెస్ అడ్రస్ గల్లంతు
టీఆరెస్ అలియాస్ బీఆరెస్ పార్టీ తెలంగాణలో అందరి నోళ్ళల్లో నానే పేరు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలిసిన పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేరు తెలువని వారు ఈ రాష్ట్రంలో లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి పార్టీ లోకసభలో అడ్రస్ కోల్పోయింది. పద్నాలుగేళ్ళు కాదు కాదు కేసీఆర్ మొన్న చెప్పినట్లు 15 యేండ్లు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్నిసాధించిన పార్టీ. పదేండ్లు తెచ్చిన రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. రాష్ట్రం నుంచి దేశరాజకీయాల్లో ఛక్రతిప్పేందుకు బీఆరెస్ గా మారి రాజకీయ నిచ్చెనలేసిన పార్టీ. అలాంటి పార్టీ గొంతుక రేపటి నుంచి లోక సభలో మనకు వినిపించదు. ఆ పార్టీ ఎంపీలు కనిపించరు.
బీఆరెస్ ముఖ్యనాయకులు పదేపదే తెలంగాణకు తమ పార్టీకి ఉన్నది పేగు బంధమని, ఆ పార్టీ నేత కేసీఆర్ కు విడదీయలేని అనుబంధం ఉందంటూ చెబుతూ వచ్చారు. తెలంగాణ ప్రజల గొంతుక లోకసభలో వినిపించాలంటే బీఆరెస్ అభ్యర్ధులను గెలిపించాలని పదేపదే చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు. కనీసంగానైనా వారి మాటను గౌరవించలేదు. ఒక్కటంటే ఒక్కస్థానంలో కూడా అవకాశం కల్పించలేదు. మరో మాటలో చెప్పాలంటే అవమానించారు. మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆరెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేక బొక్కాబోర్లా పడింది.
అన్నింటా పోటీచేసినా దక్కని ఒక్కసీటు
బీఆరెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పినట్లు తమది రాజకీయ పార్టీయే. తాము ఎలాంటి మఠాన్ని నడపడం లేదు. అధికారానికి రావాలని కోరుకుంటాం, ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే తాజా లోకసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా మడికట్టుకుని కూర్చోలేదు. తెలంగాణలో ఉన్న 17 లోకసభ స్థానాలకు 17 స్థానాల్లో పోటీచేసింది. మూడు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు పోటీచేశారు. మహబూబ్ నగర్ లో మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ లో మాలోత్ కవిత పోటీ చేశారు. మిగిలిన స్థానాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,సీనియర్ నాయకులకు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో బీఆరెస్ ఇంతకుముందూ ఇప్పుడు కూడా బలమైన పార్టీగానే ఉందని చెప్పవచ్చు.
కానీ, అనూహ్యంగా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ అభ్యర్ధి విజయం సాధించకపోవడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మిగిలిన ఏ పార్టీలకు తీసిపోకుండా ప్రచారం సైతం హోరాహోరి చేపట్టింది. ఆ పార్టీ నేత కేసీఆర్ ఏకంగా ఎన్నడూ లేని విధంగా బస్సుయాత్ర నిర్వహించి భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించారు. గతంలో హెలికాప్టర్ ప్రచారానికి పరిమితమైన కేసీఆర్ ఈసారి నేల మీదుగా ప్రచారం చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతా కలిసి సర్వశక్తులొడ్డినట్లు ఆ పార్టీ ముఖ్యనాయకులే సెలవిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు సానుకూలంగా స్పందించలేదు.
మూడవస్థానానికే పరిమితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మూడవ లోకసభ ఎన్నికలకే బీఆరెస్ పార్టీ చిరునామా ఆ సభలో లేకుండా పోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 11 మంది ఎంపీలు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తొమ్మిది మంది ఎంపీలు విజయం సాధించారు. తాజాగా 2014 ఎన్నికలొచ్చేసరికి ఒక్కరు కూడా గెలువలేకపోయారు. లోక్ సభలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. మరో అంశమేమిటంటే 17 స్థానాల్లో పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్ధులు14 స్థానాల్లో మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఒక స్థానంలో నాల్గవస్థానానికి చేరుకోగా, కేవలం ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండవ స్థానంలో నిలిచారు. ఇక్కడ కూడా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు రఘురామ్ రెడ్డి, బలరామ్ నాయక్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
బలమైన బీఆరెస్ కేమైందీ
రాష్ట్రంలో నిన్నటి వరకు బలమైన పార్టీ. అధికారంలో ఉన్న పార్టీ. పదేండ్లు అధికారాన్ని కొనసాగించిన పార్టీ. అన్నింటా నిన్నటి వరకు ఆధిపత్యం చెలాయించిన పార్టీ. బలమైననాయకులున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 39 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుపొంది రెండవ స్థానంలో ఉన్నారు. అలాంటి పార్టీ ఒక్క ఓటమితో ఇంత మంది ఎమ్మెల్యేలు, బలం, బలగం, ఆర్ధిక హంగులు, కేడర్ ఉన్న పార్టీ ఒక్క చోట గెలువకపోవడమే కాకుండా మెజార్టీ స్థానాల్లో మూడవ స్థానానికి పరిమితం కాక కేవలం రెండు చోట్ల మాత్రమే పోటీపడింది. తమకు అన్ని విధాలుగా బలమున్న మెదక్ స్థానంలో మూడవ స్థానానికి దిగజారడం ఇప్పుడు ఆ పార్టీని తీవ్రంగా కలవరపరిచే అంశంగా మారింది. ఇదిలా ఉండగా కంటోన్మెంటు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఓటమిపాలైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ విజయం సాధించారు. లాస్య నందిత మృతితో ఇక్కడ ఉప ఎన్నికొచ్చింది. ఆమె సోదరి పోటీచేసినప్పటికీ సానుభూతి కూడా పనిచేయలేదు.