Harish Rao | పరాన్న జీవులు.. కాంగ్రెస్ పాలకులు: హరీశ్‌రావు
బీఆరెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నిమయాక పత్రాలిచ్చి... బీఆరెస్ కట్టిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేస్తూ కాంగ్రెస్ పాలకులు పరాన్న జీవులుగా మారిపోయారని మాజీ మంత్రి, టీ.హరీశ్‌రావు విమర్శించారు

మా ఘనతను వాళ్ళ ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా
8నెలల్లోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేశామని..30వేల ఉద్యోగాలిచ్చామని కట్టుకథలు
75కోట్లతో లక్షన్నర ఎకరాలకు నీళ్లుస్తున్నామన్న డిప్యూటీ సీఎం భట్టికి నోబుల్ ఇవ్వాలి
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నిమయాక పత్రాలిచ్చి… బీఆరెస్ కట్టిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేస్తూ కాంగ్రెస్ పాలకులు పరాన్న జీవులుగా మారిపోయారని మాజీ మంత్రి, టీ.హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8నెలల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి హడావుడి చేసినట్టు సీతారామ ప్రాజెక్టు విషయంలో చేస్తున్నారని, సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తామే తీసుకువచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ నెల 15 న సీఎం రేవంత్ రెడ్డితో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా క్రెడిట్ తీసుకునేందుకు కాంగ్రెస్ ఖమ్మం జిల్లా మంత్రులు మరో ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును తనకూ ఇష్టమైన పనిగా మొదలుపెట్టారని, ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారన్నారు. ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చిందని, దీన్ని అవకాశంగా తీసుకుని ప్రాజెక్టు తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఈ ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టులో మూడు పంపులు, సబ్ స్టేషన్ల నిర్మాణం బీఆరెస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు.
75 కోట్ల రూపాయలతో లక్షన్నర ఎకరాల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. నాగార్జున సాగర్, ఆల్మట్టి వైపు ఖమ్మం జిల్లా ప్రజలు చూడకుండా సీతారామ ప్రాజెక్టు ప్రతి ఇంచి భూమిని సస్యశ్యామలం చేస్తుందన్నారు. ఖమ్మంను రెండు పంటలు పండే జిల్లాగా మార్చాలని సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ సంకల్పించారని చెప్పుకొచ్చారు. ఇందిరా, రాజీవ్ సాగర్‌ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీళ్లను ప్రతిపాదిస్తే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశారన్నారు. సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయంలోనే 90 శాతం పూర్తయ్యిందని, మెయిన్ కెనాల్‌లో ఎనిమిది ప్యాకేజీలు ఉంటె ఐదు ప్యాకేజీలు బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు.
సీతారామ ఘనత కేసీఆర్‌ది కాదని తుమ్మల చెప్పాలి
సీతారామ ప్రాజెక్టును అడ్డంకులు సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారని, ఈ విషయాన్ని అపుడు బీఆరెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావునే స్వయంగా చెప్పారన్నారు. సీతారామ ప్రాజెక్టును ఘనత కేసీఆర్‌ది కాదని తుమ్మల గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఖమ్మంకు గోదావరి జలాలు ఇవ్వాలనే ప్రయత్నం చేయలేదన్నారు. . సీతారామ ప్రాజెక్టుకు హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతులు బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, జూలై 2023 లోనే 67 టీఎంసీలకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2005 నుంచి తొమ్మిదేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రాజీవ్ సాగర్‌లకు ఒక్క అనుమతి తీసుకురాలేదన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నపుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రయత్నం చేయలేదన్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీళ్లు అందేలా సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. జూన్‌లోనే ఖమ్మం జిల్లాలో నాట్లు పడేలా సీతారామ ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. 3 వేల చెరువులను నింపేలా సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశామని, పాలేరుకు సీతారామ ప్రాజెక్టును కలపడం వల్ల ఖమ్మం పట్టణానికి తాగు నీటి సమస్య లేకుండా పోతోందన్నారు. కేసీఆర్ స్వయంగా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు సాధించలేదని, సాగర్ ఆయకట్టు 3.4 లక్షల ఎకరాలకు కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరందించేలా కేసీఆర్ పూనుకున్నారన్నారు. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే పాలేరు బ్యాక్‌వాటర్స్ ద్వారా నల్లగొండ జిల్లాకు సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను అందించేటట్టు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎంతో ముందుచూపుతో కేసీఆర్ ఈ సీతారామ ప్రాజెక్టును ప్రతిపాదించారన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా బీఆరెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తామన్నారు.
లిక్కర్ టార్గెట్ తప్ప..ప్రజారోగ్యం పట్టదా
కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ టార్గెట్‌ల మీద దృష్టి పెట్టడం తప్ప ప్రజారోగ్యం పట్టదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. విషజ్వరాల బారినపడి పిల్లలు చనిపోతున్నారని, పబ్లిసిటీ స్టంట్లు తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదన్నారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు ప్రారంభించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిందేమి లేదన్నారు. సర్పంచ్‌లే కాకుండా పంచాయతీ సెక్రటరీలను అప్పులు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. దమ్ముంటే మా నియోజకవర్గానికి కాంగ్రెస్ మంత్రులు వస్తే పంచాయతీల్లో నెలకొన్న దుస్థితిని నిరూపిస్తానని సవాల్ చేశారు.