ఎన్నికల వేళ.. కారుకు ట్రబుల్!

గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆరెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

ఎన్నికల వేళ.. కారుకు ట్రబుల్!
  • ప్రవళిక సూసైడ్‌తో బీఆరెస్‌ పరేషాన్‌
  • ప్రతిపక్షాలు.. నిరుద్యోగుల నిరసనలు
  • ప్రేమ వ్యవహారంతోనే అన్న పోలీసులు
  • ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేందుకే
  • ప్రతిపక్షాలు, విద్యార్థి నేతల ఆగ్రహం
  • 48 గంటల్లో నివేదిక కోరిన గవర్నర్‌

విధాత: గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆరెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ, గ్రూప్ 2 పరీక్షలు, డీఎస్సీ వాయిదాల పర్వంతో ఆగ్రహంగా ఉన్న నిరుద్యోగులలో అంతర్గతంగా నెలకొన్న నిరాశ, నిస్ప్రృహ‌లకు ప్రవళిక ఆత్మహత్య అద్దం పట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ప్రకటించడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ వివాదంతోనే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి ప్రకటించారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. అయితే ప్రవళిక ఆత్మహత్యతో వెల్లువెత్తుతున్న నిరసనతో ఇబ్బందికి గురైన ప్రభుత్వం.. వాటిని పక్కదారి పట్టించేందుకే తాజా వాదనను తెరపైకి తెచ్చిందని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్ తమిళిసై సైతం ప్రవళిక ఆత్మహత్య ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలంటూ సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. ప్రవళిక ఆత్మహత్యపై ఎవరి వాదన ఎలా ఉన్నా.. విద్యారంగం పట్ల ఉదాసీనత, ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో యువతలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నది ప్రభుత్వానికి తెలియంది కాదని నేతలు అంటున్నారు.

నిరాశలో యువత

నాలుగేళ్లుగా ఉద్యోగాల భర్తీని దాటవేస్తూ వచ్చిన బీఆరెస్‌ ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే టీఎస్‌పీస్సీ పేపర్ల లీకేజీ, పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వ వైఫల్యాలు, లీగల్‌ లిటిగేషన్లు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో సంవత్సరాల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి, కోచింగ్ సెంటర్లలో, అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థికంగా, మానసికంగా చితికిపోయి, చదివిన చదువులు వృథా ప్రయాసగా మిగిలిపోయాయన్న బాధ సహజంగానే నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ఇదే క్రమంలో ప్రవళిక ఆత్మహత్య వెలుగు చూడటంతో నిరుద్యోగ యువత, విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. వీధుల్లోకి రావడమే కాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ “బైబై కేసీఆర్‌.. కేసీఆర్ నెవ్వర్ ఎగైన్” అంటూ తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నీ రాజకీయ అవసరాల కోసం ఇంకెంత మంది పిల్లలను బలితీసుకుంటావని కూడా నెటిజన్లు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.

కేసును తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలు: పీసీసీ చీఫ్ రేవంత్‌

ప్రవళిక ఆత్మహత్య కేసును ప్రభుత్వం పోలీసుల ద్వారా తప్పుదోవ పట్టించాలని చూస్తున్నదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ప్రవళిక సూసైడ్ నోట్ ఆత్మహత్యకు కారణాలను వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు. ఆడబిడ్డ ప్రవళికకు న్యాయం చేయాలన్న వేల గొంతులు సీఎం కేసీఆర్‌కు వినబడటం లేదన్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభ్వుత్వం స్పందించాలన్నారు. యువతీ యువకుల్లారా ఆత్మహత్యలు వద్దు.. డిసెంబర్ దాకా ఓపిక పట్టండి… మన ప్ర‌భుత్వం వ‌స్తుంది.. మ‌న‌ ఉద్యోగాలు మనమే ఇచ్చుకుందాం.. అని రేవంత్ నిరుద్యోగుల‌కు ధైర్యం చెప్పారు. మన భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడుదామని, వీళ్ల నక్క జిత్తులను నడ్డి రోడ్డులో నిలబెట్టి తరిమికొడుదామన్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మన ఉద్యోగాలు మనమే ఇచ్చుకుందామన్నారు.

ఒక్క ఏడాదిలో 2ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ- రాహుల్ గాంధీ

ఎన్నిక‌ల త‌రువాత తెలంగాణ‌లో ఏర్ప‌డే కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఒక్క ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం… ఇది మా గ్యారెంటీ అని ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, నిరుద్యోగ యువత ఆశలను సాకారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి న త‌రువాత యుపీఎస్సీ త‌ర‌హాలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ప్రవళిక మృతి పట్ల ట్వీట్టర్ వేదికగా సంతాపం తెలిపిన రాహుల్‌గాంధీ ఇది ఆత్మహత్య కాదని, నిరుద్యోగ యువత ఆశలను, కలలను కేసీఆర్‌ ప్రభుత్వం హత్య చేసిందనడానికి నిదర్శనమని రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

పరీక్షల వాయిదాతోనే ఆత్మహత్య : ఖర్గే

టీఎస్పీఎస్సీ పదేపదే పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో బీఆరెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యువత నిరాశలో, కోపంలో ఉన్నారన్నారు. ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తరిమి కొట్టాలన్నారు.

ప‌రీక్ష‌ల వాయిదాలే ఆత్మ‌హత్య‌కు కార‌ణం: ప్రియాంక గాంధీ

ప్రవళిక ఆత్మహత్య వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. పరీక్షలను పదేపదే వాయిదా వేయడం ఆమె ఆత్మహత్యకు కారణమవ్వడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ యువత కష్టపడి చదివినా ఉద్యోగాలు రావడం లేదన్న నిరాశ, అసహనంతో ఉన్నారన్నారు. అందరం కలిసి ఎన్నికల్లో ఈ పరిస్థితిని మార్చాలన్నారు.