KTR | తగ్గిన ఐటీ ఎగుమతులు.. పడిపోయిన ఉపాధి అవకాశాలు: కేటీఆర్

తెలంగాణ‌లో ఐటీ ఎగుమ‌తుల త‌రుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌డిచిన ఆరేడేళ్ల‌లో తెలంగాణ‌లో ఐటీ ప్ర‌గ‌తి గ‌ణ‌నీయంగా సాగింద‌ని ఆయ‌న గుర్తు చేశారు

KTR | తగ్గిన ఐటీ ఎగుమతులు.. పడిపోయిన ఉపాధి అవకాశాలు: కేటీఆర్

ట్విటర్ వేదికగా కేటీఆర్ ఆందోళన
2022-23 లోనే ఐటీ ఎగుమతులు 57,706 కోట్లు
2023-24లో 26,948 కోట్లు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ‌లో ఐటీ ఎగుమ‌తుల త‌రుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌డిచిన ఆరేడేళ్ల‌లో తెలంగాణ‌లో ఐటీ ప్ర‌గ‌తి గ‌ణ‌నీయంగా సాగింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో, ఐటీ ఎగుమ‌తుల్లో తెలంగాణ గొప్పగా సాగింద‌ని, కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు ఆందోళ‌న‌కంగా మారుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తాజాగా రిలీజైన ఐటీ ట్రెండ్స్‌ను ప్ర‌స్తావిస్తూ కేటీఆర్‌ త‌న పోస్టులో ఓ గ్రాఫ్‌ను కూడా ప్ర‌జెంట్ చేశారు. ఐటీ ఎగుమ‌తుల్లో జ‌రిగిన త‌రుగుద‌ల‌పై కేటీఆర్ త‌న ట్వీట్‌లో కొన్ని గ‌ణాంకాల‌ను ప్ర‌చురించారు.

2022-23 సంవ‌త్స‌రంలో తెలంగాణ‌లో 57,706 కోట్ల ఐటీ ఎగుమ‌తులు జ‌రిగాయ‌ని, కానీ 2023-24లో కేవ‌లం 26,948 కోట్ల ఎగుమ‌తులు మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఇక ఐటీ ఎంప్లాయిమ్మెంట్ గ్రోత్ గ‌ణాంకాల‌ను కూడా ప్ర‌జెంట్ చేశారు. 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాల‌ను తెలంగాణ‌లో సృష్టించార‌ని, కానీ 2023-24 కాలంలో కేవ‌లం 40,285 కొత్త ఉద్యోగాల‌ను మాత్ర‌మే క‌ల్పించిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ ఐటీ ఎగుమ‌తులు త‌గ్గ‌డం తీవ్ర‌మైన ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రీ ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. కొత్త ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న ప‌డిపోయింద‌ని, 2022-23 సంవ‌త్స‌రంతో పోలిస్తే ఆ ఉద్యోగాల నియామ‌కాలు మూడో వంతు ప‌డిపోయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ రంగం కీల‌కమైంద‌ని, బీఆరెస్‌ పాల‌న స‌మయంలో ఐటీ రంగం అసాధార‌ణ ప్ర‌గ‌తిని చ‌విచూసింద‌న్నారు. గ‌త తెలంగాణ స‌ర్కారు ఎన్నో ప్ర‌గ‌తిశీల ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింద‌ని, టీఎస్ఐపాస్ లాంటి ప‌థ‌కాల‌తో ఐటీ ప్ర‌గ‌తి గ‌ణ‌నీయంగా సాగింద‌న్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఐటీ రంగార‌న్ని విస్మ‌రిస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీతో పాటు ఐటీఈఎస్ రంగాల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కారును కోరారు.

ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యుక్తంగా ఉండే విధానాల‌ను కొన‌సాగించాల‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో కోరారు. ప్ర‌స్తుతం ఉన్న ఇన్వెస్ట‌ర్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, కొత్త ర‌క‌మైన పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించాల‌ని తెలిపారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు, స్టార్ట్ అప్‌ల‌కు అన్ని ర‌కాలుగా స‌పోర్ట్ ఇవ్వాల‌ని కేటీఆర్ చెప్పారు. మౌళిక స‌దుపాయాల‌ను నిరంత‌రాయంగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉండాల‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తే.. రాష్ట్రంలో ఐటీ రంగం స‌మ‌గ్ర‌మైన వృద్ధి సాధిస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఐటీకి చెందిన రెండు రంగాల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని కోరారు. ఐటీ ఎగుమ‌తులు, ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌స్తుతం స‌ర్కారు వెన‌క‌బ‌డి పోయింద‌ని, ఈ రెండింటిపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టాల‌ని కేటీఆర్ త‌న ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు.