KTR | లారీ డ్రైవర్‌పై పోలీసుల బూతులు.. ఇదేనా మీ పోలీసుల ప్రవర్తన అంటూ డీజీపీకి కేటీఆర్ ప్రశ్న

గండి మైసమ్మ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీ పార్క్ చేసిన ఓ యువకుడిని ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకుంటూ.. దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KTR | లారీ డ్రైవర్‌పై పోలీసుల బూతులు.. ఇదేనా మీ పోలీసుల ప్రవర్తన అంటూ డీజీపీకి కేటీఆర్ ప్రశ్న

విధాత, హైదరాబాద్: గండి మైసమ్మ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీ పార్క్ చేసిన ఓ యువకుడిని ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకుంటూ.. దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఇదేనా మీ పోలీసుల ప్రవర్తనా.. ఇది ఎంతటి చెత్త భాషనో తెలంగాణ డీజీపీకి అర్ధం అవుతోందా? అని, ఇది ఆమోదయోగ్యమైన ప్రవర్తనా? మీకు ఆమోదయోగ్యమేనా అంటూ డీజీపీని ప్రశ్నించారు.

అలాగే పోలీసు సిబ్బంది, అధికారులకు జీతాలు చెల్లించేది పౌరులేనని దయచేసి గుర్తుంచుకోవాలన్నారు. పోలీసుల ప్రవర్తనను మార్చేందుకు మీరు సెన్సిటైజేషన్ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. నా ట్వీట్ కేవలం ఒక సంఘటన గురించి మాత్రమే కాదని, పౌరులతో పోలీసులు అత్యంత అనుచితంగా ప్రవర్తిస్తున్న అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తున్నానని తెలిపారు. ఇక పౌరులతో ప్రత్యక్ష సంబంధంలో ఉండే పోలీసుల ప్రవర్తనను మార్చేందుకు మీరు సెన్సిటైజేషన్ తరగతులు నిర్వహిస్తారని అశిస్తున్నానని కేటీఆర్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.

కాగా ఈ ఘటనపై బీఆరెస్ పార్టీ స్పందిస్తూ.. చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా.. అని, పాలించేటోడు ఎట్లుంటడో, కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటదని పలు విమర్శలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీడ్రైవర్ పైన చేయిచేసుకొని ట్రాఫిక్ పోలీస్ దుర్భాషలాడరని, తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏందని ప్రశ్నించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు? అని ట్విట్టర్ లో తెలంగాణ సీఎంనో ను ట్యాగ్ చేసింది.

స్పందించిన సైబరాబాద్ పోలీసులు

లారీ డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ మారడంతో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. తమ అధికారి ఒకరు అనుచితంగా వ్యవహరించినందుకు విచారం వ్యక్తం చేశారు. . ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారిని అతని విధుల నుండి తక్షణమే రిలీవ్ చేశామని,తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో తెలిపారు