Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో.. కులాల కొట్లాట!

ఇది ఇక్కడితో ఆగిపోతుందా? లేక మరిన్ని గళాలు లేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ చాటా స్ట్రిక్ట్ గా ఉంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి.  ఈ తిరుగుబాట్లను ఆమె  ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో.. కులాల కొట్లాట!

Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులాల కొట్లాట ముదురు పాకాన ప‌డుతోంది. సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎంపీ, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ అంశాన్ని కీల‌క చ‌ర్చ‌నీయాంశం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాష్ట్ర కాంగ్రెస్ సైతం తాము గెలిస్తే రాష్ట్రంలో కుల గ‌ణ‌న నిర్వ‌హిస్తామ‌ని హామీ ఇచ్చింది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆ హామీని అమ‌లు చేస్తూ కుల గ‌ణ‌న స‌ర్వే నిర్వ‌హించారు. అధికారులు ఇంటింటికీ తిరిగి కులాల వారీగా వివ‌రాలు సేక‌రించి ఏ కులాల సంఖ్య ఎంత ఉన్న‌దో తేల్చారు. అయితే.. ఇది ప్ర‌తిప‌క్షాల నుంచే కాకుండా సొంత పార్టీలోనూ ర‌చ్చ‌కు దారి తీసింది. క్ర‌మంగా కాంగ్రెస్ పార్టీలోనే కులాల కొట్లాట‌గా మారుతూ వ‌స్తున్న‌ది.

బీసీ కులాల లెక్క‌లు వెల్ల‌డించిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్ర‌స్తుతం స‌స్పెండ్ అయిన‌ ఎమ్మెల్సీ చింత పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ (Teenmar Mallanna) స‌ర్వేను త‌ప్పు ప‌ట్టారు. అంత‌టితో ఆగ‌కుండా కుల‌గ‌ణ‌న స‌ర్వే లెక్క‌ల ప‌త్రాల‌ను త‌న చాన‌ల్‌లో త‌గుల బెట్టారు. బీసీల జ‌నాభాను కావాల‌ని త‌క్కువ చేసి చూపిస్తున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌ల‌ను అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ, బీఆరెస్‌ అందిపుచ్చుకున్నాయి. ముస్లింల‌ను బీసీ జాబితాలో ఎలా చేర్చుతార‌ని బీజేపీ ప్ర‌శ్నించింది. బీఆరెస్ కూడా కులగణన సర్వేను తప్పు పట్టింది. బీఆరెస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలకు దీనికి తేడా ఉందని ఆరోపించింది. ఇలా తీన్మార్ మల్లన్న తీరుతో రాష్ట్రవ్యాప్తంగా కులాల పంచాయతీకి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీలో కులాల కొట్లాట దీంతో మొదలై ముదురు పాకాన పడింది.

తీన్మార్ మల్లన్న బాటలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు తన నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరు కావడంతో ఈ సమావేశం కూడా వివాదం అయింది. దీంతో వీహెచ్‌పై హై కమాండ్ సీరియస్ అయింది. దీంతో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వీహెచ్‌కు ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్.. పార్టీ నుంచి మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేయ‌డంపై తీవ్రంగానే స్పందించారు. సొంత‌ పార్టీపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క బీసీ నేతలపై నే చర్యలు తీసుకుంటారా? రెడ్లపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆరోప‌ణ‌లు చేస్తే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని నిలదీశారు. ఇంత‌టితో ఆగ‌కుండా బీసీల స‌మావేశానికి జానారెడ్డి, కేకేల‌ను పిలిచారు కానీ, త‌న‌నెందుకు పిల‌వలేద‌ని ప్ర‌శ్నించారు. ప‌రోక్షంగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నార‌న్న చ‌ర్చ న‌డుస్తున్న‌ది. ఇది ఇక్కడితో ఆగిపోతుందా? లేక మరిన్ని గళాలు లేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ చాటా స్ట్రిక్ట్ గా ఉంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి.  ఈ తిరుగుబాట్లను ఆమె ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.