20ఏళ్ల రాజకీయ ప్రయాణం..నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్ రెడ్డి

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. మిడ్జిల్ జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు సాగిన తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

విధాత, హైదరాబాద్ : 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. మిడ్జిల్ జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు సాగిన తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. లక్షల అక్షరాలతో రాసినా..కోట్ల పదాలను కూర్చి చెప్పినా..తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం అని అభివర్ణించారు. నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం..ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు చెబుతున్నానని తెలిపారు.

ఇదే స్ఫూర్తితో.. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో, భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా.. అన్నింటికీ మించి మీ రేవంతన్నగా.. మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నానన్నారు.

ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం మిడ్జిల్ కు చేరుకుని.. పలు ప్రజాసంక్షేమ, అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు.

మిడ్జిల్ జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు…

రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న, తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు.ఆర్థికంగా సాధారణ రైతు కుటుంబానికి చెందిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశారు. తన జీవిత భాగస్వామి గీతా అండతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే గెలవడం విశేషం. 2009లో కొడంగల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ.. ప్రజాశీర్వాదంతో రేవంత్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తరువాత 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో నుంచి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కానీ ఓటమిని గెలుపు సోపానంగా మార్చుకుని పట్టుదలతో 2019లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికై సంచలనం రేపారు.

పీసీసీ చీఫ్  నుంచి సీఎం పదవీ వరకు..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని 2021 జూన్ 26 పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని మరో మలుపు తిప్పింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తింపు తీసుకొచ్చారు. చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. స్వయంగా రేవంత్‌రెడ్డి 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల‌ నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి..ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు తన కృషితో రాష్ట్ర అత్యున్నత పదవిని చేరుకోవచ్చని నిరూపించారు.

ప్రజా ప్రభుత్వ సారధిగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి “ప్రజాపాలన” అనే భావనతో పరిపాలనతో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, భారీ ఉద్యోగ నియామకాలు, పెట్టుబడుల ఆకర్షణ, పారదర్శక పాలన, సంక్షేమం–అభివృద్ధి సమతుల్యత వంటి అనేక కార్యక్రమాలతో ప్రజల ప్రభుత్వాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తూ…తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించే దిశగా పురోగమిస్తున్నారు. రేవంత్ రెడ్డి 20ఏళ్ల రాజకీయ ప్రయాణం పదవుల కథ కాదు. ఇది పోరాటాల చరిత్ర. ఓటములను అవకాశాలుగా మలచుకున్న నాయకత్వం. కేసులు, జైలు, రాజకీయ కుట్రలు, విమర్శలు… ఏదీ ఆయనను ఆపలేకపోయాయని,..ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం కష్టమే… కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఆ రెండింటినీ సాధించిన నాయకుడే రేవంత్ రెడ్డి అని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Latest News