Retirement Benefits | రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సమస్యలకు త్వరలో పరిష్కారం.. : సంక్రాంతి వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన
రిటైర్‌మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఎం పెంపు విషయంలోనూ కీలక ప్రకటనలు చేశారు.
Retirement Benefits | సంక్రాంతి పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు సంబంధించి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డీఏ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డీఏపై సంతకం చేసి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో డీఏ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 3 డీఏలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, మరో డీఏ విడుదలకు సంతకం చేసినట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ, ‘బాల భరోసా’ పథకం, “ప్రణామ్” డే కేర్ సెంటర్ల ప్రారంభం కార్యక్రమాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
డీఏను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశామని, పెరిగిన డీఏ 2024 జులై 1 నుంచి వర్తిస్తుందని, జనవరి నెల వేతనంతో పెరెగిన డీఏ చెల్లింపు జరుగుతుందని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 30లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లుగా తెలిపారు.
ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా
ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కార్యాలయం నిర్మాణానికి సహకరిస్తాం. ప్రజలకు మంచి పరిపాలన అందిద్దాం.. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది అన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేనని రేవంత్ రెడ్డి అన్నారు. ‘మీరే మా సారధులు, మా వారధులు.. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా’ అంటూ భరోసా ఇచ్చారు. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని రేవంత్ అన్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారని, ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపిస్తున్నారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తమపై మోపి వెళ్లిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18 వేల కోట్లు.. కానీ ప్రతీ నెలా 22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ‘గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి? ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించాలి’ అని ఉద్యోగులను సీఎం కోరారు.
జిల్లాల పునర్విభజనపై కమిటీ..!
జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు, డిమాండ్స్ వచ్చాయని.. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారు అని, జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణకు త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జితో ఒక కమిషన్ ను నియమిస్తాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తాం. ఒక్క రాచకొండ పేరు తప్ప జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల పేర్లు మార్చలేదని గుర్తు చేశారు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10 నుంచి 15 శాతం కట్
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10 నుంచి 15 శాతం కట్ చేస్తామని, కట్ చేసిన ఆ డబ్బును తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తాం అని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేసేలా చూస్తామని, తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది అని, రాబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి అని, వైకల్యం అనే ఆలోచనను రానివ్వకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి అని కొనియాడారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు, విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి కేటాయిస్తున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించింది అని గుర్తు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram