తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది తీరాన నాగార్జున సాగర్ ప్రాజెక్టు చెంతన విజయ్ విహార్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగం ముగింపు క్రతువు పూర్ణాహుతి ఘట్టంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతితో వరుణ యాగం ముగించారు.
అంతకుముందు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉదయం నుంచే యాగ క్రతువుల్లో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ నిర్వహణ క్రతువులో భాగాంగా తొలుత చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. 11 హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేదమంత్రాల నడుమ హోమద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి… మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు… వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, తెలంగాణ జలాశయాలు, చెరువులు నిండి జలకళతో కళకళలాడాలని… భూగర్భ జలాలు పెరగాలని… సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు నీటి కొరత రాకూడదని… రైతాంగం సుభిక్షంగా ఉండాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ వరుణ యాగం తలపెట్టినట్లుగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
విజయపురికి వరుణారాధనతో ప్రాచీన అనుబంధం
మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేదపండితులు వివరించారు.
వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన… ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చిందని తెలిపారు.
మహా వరుణ యాగం కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి కే.జానారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి బ్రదర్స్, కొండా సురేఖ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సలహాదారు కే.కేశవరావు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
