CM Revanth Reddy | ప్రజలు శిక్షించినా బీఆరెస్ మారలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలు శిక్షించినా బీఆరెస్‌ మాత్రం మారలేదని, పదేళ్ల పాలనలో చేసిన తప్పులకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు శిక్షించారని, అయినా వారి తీరు మారలేదని, ఇకనైనా బీఆరెస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్ధిస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చురకలేశారు

CM Revanth Reddy | ప్రజలు శిక్షించినా బీఆరెస్ మారలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

తండాలకు బీటీ రోడ్లు.. మౌలిక వసతులు

విధాత, హైదరాబాద్: ప్రజలు శిక్షించినా బీఆరెస్‌ మాత్రం మారలేదని, పదేళ్ల పాలనలో చేసిన తప్పులకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు శిక్షించారని, అయినా వారి తీరు మారలేదని, ఇకనైనా బీఆరెస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్ధిస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చురకలేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రశ్నాత్తోర సమయంలో తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ పై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో తండాలు గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందినా… అక్కడ మౌలిక వసతుల కల్పన జరగలేదన్నారు.

ఓ తండాకు రోడ్డు ఉంటే కరెంట్ సౌకర్యం లేదని, కరెంట్ ఉంటే తాగునీరు లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాండాలు, గూడెలపై పూర్తి నివేదికను తయారు చేశామని, సుమారు 7 లక్షల తాండాలు, గూడెల్లో నేటికీ తాగునీరు, కరెంట్, మంచినీటి సదుపాయాలు లేవనే విషయాన్ని సీఎం రవంత్‌రెడ్డికి సభకు వివరించారు. అయితే బీఆరెస్ నాయకులు అన్ని తండాల్లో వసతులు కల్పించామని అబద్దాలు చెబుతూ వచ్చారని మండిపడ్డారు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు.

పంచాయతీలను, తండాలను అభివృద్ధి చేస్తాం: మంత్రి సీతక్క

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చే ప్రశ్నకు అసెంబ్లీలో మంత్రి సీతక్క సమాధానిమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1851 ఆవాస గ్రామాలు, తాండాలు గ్రామ పంచాయతీగా మార్చబడ్డాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర గ్రాంట్లతో సమానంగా రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లను ఎస్‌ఎఫ్‌సీ విడుదల చేస్తోందని, సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షికాదాయం వున్న పంచాయతీలకు అదనంగా 5 లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు.

ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం నియమించిందని, అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిక, క్రీడా ప్రాంగణంను కలిగి వున్నాయని తెలిపారు. 6176 గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు లేవని, త్వరలో నిర్మిస్తామన్నారు. గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల వేతనల కోసం 378.88 కోట్లు విడుదల చేశామని తెలిపారు. మారుమూల తండాల్లో రోడ్డు, విద్యుత్తు, విద్యావ్యవస్థలు సరిగా లేవని, ఇతర వర్గాల ప్రజలతో సమానంగా మారుమూల తండాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగు పరుస్తామని చెప్పారు.

అందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. పలు పంచాయతీలు రెవెన్యూ పంచాయతీలుగా మారలేదని, 1936లో ల్యాండ్ సర్వే చేశారని, తర్వాత ల్యాండ్ సర్వే చేయకపోవడంతో చాలా గ్రామపంచాయతీలు రెవెన్యూ పంచాయతీలుగా మారలేదన్నారు. గ్రామ పంచాయతీలను రెవిన్యూ పంచాయతీలుగా మార్చేందుకు రెవెన్యూ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కోన్నారు.