CM Revanth Reddy | ఆ నిర్ణయం నాది కాదు.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో చాల మాట్లేడేది ఉంది
రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణకు సంగీత కూర్పు వ్యవహారంతో నాకు సంబంధం లేదని, ఎవరితో సంగీతం చేయించుకోవాలనే నిర్ణయం అందెశ్రీకే వదిలేశానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు

రాష్ట్ర గీతానికి సంగీతం కూర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి
రాచరికం ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నం
ఫోన్ ట్యాపింగ్‌పై బీఆరెస్ నేతలు సీబీఐ విచారణ కోరుతారా
నిపుణులు..జ్యూడిషియల్ కమిటీ నివేదిక మేరకే కాళేశ్వరంపై నిర్ణయం
రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీకి ఆహ్వానం
విధాత, హైదరాబాద్: రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణకు సంగీత కూర్పు వ్యవహారంతో నాకు సంబంధం లేదని, ఎవరితో సంగీతం చేయించుకోవాలనే నిర్ణయం అందెశ్రీకే వదిలేశానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం బాధ్యతను ఇతర రాష్ట్ర సంగీత దర్శకుడికి అందించడం పట్ల బీఆరెస్ చేసిన విమర్శలపై అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి స్పందించారు. జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీ కే పాట రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని, అందెశ్రీనే కీరవాణిని ఎంపిక చేశారని, సంగీత దర్శకుడి ఎంపికలో నా పాత్ర లేదని రేంవత్ వెల్లడించారు.
తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని,. రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని, త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని, రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్‌ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌కు ఇచ్చామని తెలిపారు. రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉండబోతుందన్నారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని వెల్లడించారు. సమ్మక్క, సారక్క – నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందని, పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుందని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతారా
అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే బీఆరెస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు ఫోన్ ట్యాపింగ్‌ఫై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్యాయని, ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందన్నారు. హార్డ్ డిస్కులు, డేటా బ్యాకప్ ఫామ్‌హౌస్‌లో ఉన్నాయో ఎక్కుడున్నాయో విచారణ అధికారులే తేల్చాలన్నారు. డేటా ఉందో, లేదో.. ఎలా మాయం చేసారో అంతా విచారణలో తేలుతుందన్నారు. దీనిపై ఎన్నికల కోడ్ ఉన్నందునా తాను ఇంకా సమీక్ష చేయలేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదని చెప్పారు.
ఎన్నికల కోడ్ ముగిశాక వాటి గురించి వివరిస్తా
కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలపై నిపుణుల సలహాతో ముందుకెళ్తామని, ప్రస్తుతం అక్కడ నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక విరిగిందని తాను ముందే చెప్పానని, బీఆరెస్ ప్రభుత్వ హయంలో కాళేశ్వరం ద్వారా 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, వాటి విద్యుత్ బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని, రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య, కోతలు లేవని, కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్తుకు సంబంధించిన అన్ని విషయాలు వివరిస్తానని సీఎం రేవంత్ తెలిపారు.
రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అంత హింస జరిగిన తెలంగాణలో ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదని.. రాజకీయ ప్రత్యర్ధులు సైతం విమర్శించడానికి వీలు లేకుండా పోలీసు అధికారుల ట్రాన్స్‌ఫర్‌లు లేకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో వేడుకలు జరిగాయని.. ఎక్కడ హింసకు తావు లేకుండా శాంతి భద్రతలు చూసుకున్నామంటు చెప్పారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఆహ్వానం అందించినట్లుగా తెలిపారు.