CM Revanth Reddy : ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యం
ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యం అని సీఎం రేవంత్ గోదావరి ఫేజ్ 2&3 శంకుస్థాపన చేసి, మూసీ నది ప్రక్షాళనకు కట్టుబడతామన్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్8(విధాత): ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యమని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడిందన్నారు.
వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణమన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయన్నారు.
1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని, నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవని స్పష్టం చేశారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందని, కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చానని తెలిపారు.
20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నాం, ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నామని, చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం, ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తొలగించింది మీరు కాదా అని విమర్శించారు. చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా అని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.
గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు… కానీ మేం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదని, ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని సీఎం కోరారు.
తెలంగాణ రైసింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 న తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు.నగర అభివృద్ధిలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.